హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వివరించింది. కొన్ని చోట్ల సాధారణం కన్నా 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండలు పెరుగుతాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.