హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎడతెరిపి లేకుం డా వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపిం ది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీచేసింది. ఈ ఏడాది నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ సగటు వర్షపాతం కంటే 31% నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్ర సాధారణ సగటు వర్షపాతం 738.6 మి.మీకు గాను 962.6 మి.మీ వర్షపాతం కురిసిందని తెలిపింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.