హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు మోస్తారు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. దీంతో ఏపీలోని కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, తమిళనాడులోని పలు పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు వర్షాలు పడొచ్చన్న హెచ్చరిక నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సమీక్ష నిర్వహించారు. తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల్లో పూడికతీతకు శ్రీకారం టెండర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జలాశయాల్లో పూడికతీత ద్వారా ఆదాయం రాబట్టుకోవడంతోపాటు నీటి నిల్వ సామర్థాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద మూడు ప్రాజెక్టులను ఎంపిక చేసింది. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు, కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయాల నుంచి పూడికను వెలికితీసే ప్రక్రియను షురూ చేసింది. దీనికోసం టెండర్లు నిర్వహించి గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మంగళవారం టెండర్ల కోసం ఉత్తర్వులు జారీ చేసింది.