Rains | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదా ద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ట్రాన్స్ఫార్మర్ను మీరే రిపేర్ చేసుకోండి!
షాబాద్, మార్చి 22: ‘ట్రాన్స్ఫార్మర్ను మీరే రిపేర్ చేసుకోండి.. మేము వచ్చి చేయాలంటే కుదరదు’ అంటూ విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ముద్దెంగూడ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నెల రోజుల నుంచి ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ తక్కువ ఉన్నదని, కొత్త ఆయిల్ తెచ్చి పోయాలని చెప్తే ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఆయిల్ పోయకపోవడంతో లోవోల్టేజీ కారణంగా మోటర్లు నడవడం లేదని, ఇదే విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని చెప్తున్నారు.