హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చెప్పారు. అలాగే ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఉన్నందున బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. గురువారం కొన్ని జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. గడిచిన 24గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు.
సమగ్ర సమాచార, ప్రసార విధానం కోసం మార్గదర్శకాలు
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సమగ్ర సమాచారం, ప్రసార విధానం కోసం అవసరమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్, అవుట్డోర్, డిజిటల్ మీడియా రంగ నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సమాచారశాఖ ప్రత్యేక కమిషనర్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ లేదా అడిషనల్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం డైరెక్టర్, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం పొటోగ్రఫీ విభాగం హెచ్‌వోడీ, సమాచారశాఖ మాజీ డైరెక్టర్ సుభాష్‌గౌడ్, ఐ అండ్ పీఆర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, అవుట్డోర్ విభాగాల సీనియర్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీ హోదా అధికారి, కమర్షియల్ ట్యాక్స్శాఖ నుంచి జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి, ఐ అండ్ పీఆర్ రిటైర్డ్ డైరెక్టర్ ఏ సత్యరావును ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ మూడు నెలల్లో మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది.