TG Weather | తెలంగాణలో రాబోయే ఐదురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర కోస్తా, తమిళనాడులో కేంద్రీకృతమైన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుందని.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు వంగి ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈ నెల 20 వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావంతో 22 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత వాయువ దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపే, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలుపడుతాయని ఐఎండీ అంచనా వేసింది.