Rains | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయని, దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా, కొన్ని రోజులుగా రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది. పగలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం సగానికి పడిపోతుండగా, రాత్రి వరకు ఒక్కసారిగా పెరుగుతుండటమే ఈ పరిస్థితికి కారణమని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.