Weather Update | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో ఏపీలో వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తెలంగాణలో వర్షాలు లేనప్పటికీ గంటకు పదిహేను మీటర్ల వేగంతో చలిగాలులు వీయనున్నట్టు తెలిపింది.
బుధవారం రాత్రి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో కనిష్ఠంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో 13.3, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 13.7, నిర్మల్ జిల్లా పెంబీలో 14.1, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 14.4, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 14.5, మహబూబ్‌నగర్‌లో 14.9, నల్లగొండ జిల్లా చింతపల్లిలో 15 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15.1 డిగ్రీల నుంచి 18.2 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.