వరంగల్ : అకాల వర్షం జిల్లాలో అపార నష్టం మిగిల్చింది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగళ్లతో వానకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వానతో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరి, గీసుకొండ, సంగెం, ఖిలావరంగల్ తదితర మండలాల్లోని గ్రామాల్లో వడగళ్ల వానతో మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి.
మిర్చి చెట్లు విరిగి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంటలో కర్రలు నేలవాలాయి. నష్టపోయిన పంటలను చూసి రైతులు కుమిలిపోతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివిధ గ్రామాలను సందర్శించి వడగళ్ల వానతో నష్టం కలిగిన పంటలను పరిశీలించారు.