హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బం గాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఆవర్తనాల కారణంగా మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో బుధవారం సాయంత్రం పలు చోట్ల బీభత్సమైన వర్షం కురిసింది. వర్షంతో నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌జాం అయ్యింది. ఒకవైపు వర్షం ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠంగా 22 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.