వరంగల్, జూలై 1/ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రుతుపవనాల ప్రభావంతో మంగళవారం పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది. వాన రాకతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. హనుమకొండలోని బస్ స్టేషన్ రోడ్డు, కాకాజీ కాలనీ, అంబేద్కర్ భవన్ ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు పెద్ద ఎత్తున నిలిచింది. వరంగల్లోని హెడ్ పోస్టాఫీస్, సీకేఎం దవాఖాన రోడ్డు, వరంగల్ చౌరస్తా, పాత బీటుబజార్ ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయం కావడం, అనేక కాలనీల్లోని అంతర్గత రోడ్లపై నీరు నిలువడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, కరకగూడెం, పెనుబల్లి, వేంసూరు, వైరా, కొణిజర్ల, రఘునాథపాలెం, కామేపల్లి, తిరుమలాయపాలెం, పాలేరు, ఖమ్మం రూరల్, కూసుమంచి తదితర మండలాల్లో జోరువాన కురిసింది. సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం పంచాయతీలోని జెట్టివారిగూడెం, పెనుబల్లి మండలం చినియాతండాలో రహదారిపై భారీ చెట్లు నేలకూలాయి. వర్షం అన్నదాతల మోముల్లో ఆనందాన్ని నింపింది. పంటలకు ప్రాణం పోసినట్లయింది.