హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం అకడకడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలు, నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజులలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతోపాటు రుతుపవనాల ప్రభావంతో మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
దంచికొట్టిన ఎండలు
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా కేతపల్లిలో అత్యధికంగా 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని 22 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.