హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత నెల నుంచి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు అధ్వానంగా మారాయి. వాటి మరమ్మతులకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదు. కనీసం ప్యాచ్‌వర్క్‌లు చేసేందుకు కూడా నిధులు విడుదల చేయడంలేదు. ఇప్పటికే ఆర్అండ్బీ రోడ్ల ప్యాచ్‌వర్క్‌లకు సంబంధించిన రూ.150 కోట్ల బిల్లులు రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు చేసినవారంతా చిన్న కాంట్రాక్టర్లు కావడంతో ఆర్థిక సమస్యల వల్ల ఇప్పుడు కొత్త పనులు చేపట్టడంలేదు. దీంతో రోడ్లపై చిన్నపాటి గుంతలను సైతం పూడ్చేవారే లేక జనం నరకయాతన అనుభవిస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల ఆర్అండ్బీ పరిధిలోని 37 డివిజన్లలో 1,039 కి.మీ. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వీటి శాశ్వత పునరుద్ధరణకు రూ.1,157.46 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక తక్షణ మరమ్మతులకు రూ.53.76 కోట్లు అవసరమని గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా ఇంతవరకు తాత్కాలిక మరమ్మతులకు గానీ, శాశ్వత పునరుద్ధరణ పనులకు గానీ కనీసం రూపాయి కూడా విడుదల చేయలేదు. మరోవైపు గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో నదులు, వాగులు పొంగిపొర్లి రోడ్లు కొట్టుకుపోయాయి. ఆ నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉన్నది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాక నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్టు అధికారులు తెలిపారు.
రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం లేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. నిరుడు భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు దాదాపు రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. ‘అన్ని రోగాలకూ ఒకటే మందు’ అన్నట్టుగా ‘హ్యామ్’ ప్రాజెక్టుతో రోడ్లన్నీ బాగుచేస్తామని కాలయాపన చేస్తున్నది. ‘హ్యామ్’ విధానం గురించి ఏండ్లుగా చర్చ జరుగుతున్నా టెండర్ల ప్రక్రియ మొదలుకాలేదు. ఈ విధానం జిల్లా కేంద్రాలను కలిపే పెద్ద రోడ్లకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని, చిన్నాచితకా రోడ్లకు సరిపడదని కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు స్పష్టం చేయడంతో ఆ ప్రతిపాదన అటకెక్కినట్టు కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆగస్టులోనే టెండర్లు పిలుస్తామని చెప్పిన సర్కారు.. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడమే ఇందుకు నిదర్శనం.