హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా వరుస పర్వదినాల నేపథ్యంలో ప్రయాణికులు ఇక్కట్లు తప్పడం లేదు. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల నుంచి ఊళ్లకు పెద్ద ఎత్తున తరలివెళ్తుంటారు. ఇప్పటికే పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో నిత్యం ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, వరంగల్, కాజీపేట, ఖమ్మం వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. రైళ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి.
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సరిపడా రైళ్లను ఏర్పాటు చేకపోగా, రెగ్యులర్ రైళ్ల స్థానంలోనే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో జనరల్ బోగీల సంఖ్యను పెంచకుండా, రిజర్వేషన్ల బోగీలకే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు. దీంతో ప్రత్యేక రైళ్ల ఏర్పాటులో దక్షిణ మధ్య రైల్వే విఫలమైందని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికుల క్షేమం కంటే, అధికాదాయం కోసమే రైల్యేశాఖ ఆరాటపడుతుంది.
ఇదే అదనుగా ప్రత్యేక రైళ్ల పేరిట రెగ్యులర్ టికెట్ ధరలపై అదనంగా దాదాపు 50% వరకు వసూలు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రయాణ సమయానికి అనుగుణంగా టికెట్ చార్జీల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నట్టు ప్రయాణికులు వాపోతున్నారు. వరుస పండుగలను దృష్టిలో పెట్టుకుని, ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా, టికెట్‌పై అదనపు చార్జీలు వడ్డించకుండా రైల్వే అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.