మహబూబ్‌నగర్, మార్చి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైల్వే డబుల్ లైన్ నిర్మాణం పేరుతో దక్షిణ మధ్య రైల్వే పేదల ఇండ్లకు ఎసరు పెడుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఎన్నో ఏండ్ల నుంచి రైల్వే లైన్ చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలకు రైల్వే శాఖ చేపడుతున్న విస్తరణ పనులు జీవన్మరణ సమస్యగా మారినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రైల్వే డబుల్ లైన్ పనుల్లో ఇండ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల మహబూబ్‌నగర్ నుంచి కర్నూలు వరకు డబుల్ లైన్ పనులు ప్రారంభమయ్యాయని, అయితే రైల్వే లైన్ చుట్టుపక్కల హద్దులను గుర్తించడంలో రైల్వే శాఖ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. డబుల్ లైన్ వల్ల చాలామంది పేదల ఇండ్లు కోల్పోవడమేకాక, వందలాదిమంది తమ ఇండ్లకు వెళ్లడానికి దారి కూడా లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓవైపు తొమ్మిది ఫీట్లు కటాఫ్‌గా పేర్కొని భారీ గోడ నిర్మాణం చేపడుతున్నారని, మరోవైపు 9 ఫీట్లు కాకుండా మరో 10 ఫీట్లు ఎక్కువగా మార్కింగ్ వేయడంతో సుమారు 300 మంది పేదల ఇండ్లు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే పనులు చేపట్టాలని, లేదంటే బాధితులతో కలిసి ఢిల్లీకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు.