హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం పలు జిల్లాల్లోని చెక్‌పోస్టులు, ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.72 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ ఆర్టీఏ చెక్‌పోస్ట్, పెద్దపల్లి, తిరుమల్గిరి, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయాల్లో దాడుల నిర్వహించగా, ఎటువంటి అకౌంట్‌కు జమకాని రూ.1,81,030ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
పలువురు అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించినట్టు వివరించారు. ఖమ్మం జిల్లా బుర్గంపాడు, వరంగల్ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.91,000 అకౌంటు కాని నగదును పట్టుకున్నట్టు వెల్లడించారు. అవినీతికి పాల్పడిన పలువురు అధికారులపై కేసులు నమోదు చేశామని, పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే.. టోల్ ఫ్రీ 1064, 9440446106 నంబర్లకు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.