హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వరం ప్రాజెక్టును బలిపీఠంపైకి నెట్టారు. ఒక లోపాన్ని ఆసరాగా చేసుకొని ప్రాజెక్టుపై బీజేపీ.. దాని తోక పట్టుకొని కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం కుట్రలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే లోపభూయిష్టమైన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక విడుదలైనట్టు స్పష్టమవుతుంది. నివేదిక వెలువడిన శుక్రవారం చోటుచేసుకున్న వరుస పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
దశాబ్దాల తెలంగాణ రైతాంగ గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. నాలుగైదు సీజన్లుగా ఈ పథకం ఫలాలతోనే తెలంగాణలో సాగు విస్తీర్ణం ఊహించనిరీతిలో పెరిగింది. ఈ పథకం నిర్మాణంపై డిస్కవరీ చానల్ వంటి అంతర్జాతీయ మాధ్యమాల్లోనూ ప్రశంసల వర్షం కురిసింది. ఎంతోమంది నిపుణులు, పర్యావరణవేత్తలు చివరకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్‌తోపాటు అనేకమంది ఇంజినీర్లు స్వయంగా వచ్చి పరిశీలించి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. 2016లో ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసిన సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తే 2019లో అందుబాటులోకి వచ్చింది. అంటే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బ్రాండ్ అంబాసిడర్లాంటిది. నాలుగైదు ఏండ్లుగా ఆ ఫలాలను అందుకుంటున్న రైతాంగం, తద్వారా ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు పొందుతున్న ఇతర వర్గాలు సీఎం కేసీఆర్ వెంట ఉన్నాయి. సాధారణంగా ఎన్నికల్లో ప్రజలు కృతజ్ఞతగా బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారనేది జగమెరిగిన సత్యం. సరిగ్గా ఇదే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కంటగింపుగా మారింది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హడావుడిగా శుక్రవారం నివేదిక విడుదల చేసింది. వాస్తవానికి తెలంగాణ నీటిపారుదలశాఖ నుంచి పూర్తిస్థాయి వివరాలు రానందున ఇప్పటికిప్పుడు నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, దీని వెనక పెద్ద ఎత్తున మంత్రాంగం నడిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పీఎంవో వేదికగానే ఇదంతా కొనసాగినట్టు సమాచారం. వివరాలు వచ్చినా, రాకున్నా లోపాలు ఉన్నట్టుగా నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ బృందంపై ఒత్తిడి ఉన్నట్టు తెలిసింది. నివేదికను అడ్డం పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ పథకం రచించింది.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముందే నివేదికను రూపొందించి బయటికి వదిలారు. కేవలం ఆరు గంటల పరిశీలనతో డాక్యుమెంట్లు ఏవీ లేకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడం ఇంజినీరింగ్ నిపుణులను విస్మయానికి గురి చేస్తున్నది. విపక్ష నేతలు మిడిమిడి జ్ఞానంతో చేసిన ఆరోపణలనే సాంకేతికంగా ఎస్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. నివేదిక రాబోతున్నదని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బీజేపీ రాష్ట్ర నేతలకు స్పష్టమైన సమాచారం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పథకం ప్రకారం నివేదికను తెలంగాణ నీటిపారుదలశాఖకు అధికారికంగా పంపకుండా బీజేపీ నేతలు.. తద్వారా కాంగ్రెస్ నేతలు, మీడియాకు లీక్ చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒకవైపు, కాంగ్రెస్ నేతలు మరోవైపు దీనిపై వరుసగా ఆరోపణలు చేయడంతో పాటు కాళేశ్వరం పథకాన్ని బద్నాం చేసేందుకు పెద్ద ఎత్తున దాడి చేశారు. నివేదిక రాక ముందు, వచ్చిన తర్వాత ఇరు పార్టీల నేతల ఆరోపణలు, విమర్శలు ఒకేలా ఉండడం గమనార్హం.
సిద్ధాంతపరంగా విరుద్ధమని చెబుతున్నప్పటికీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు రహస్య మిత్రులుగానే కొనసాగుతున్నాయని కాళేశ్వరం అంశం మరోసారి రుజువు చేసింది. కొన్నిరోజులుగా ఇదే అంశంపై మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు, అటు రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు ఒకేలా ఉంటున్నాయి. నివేదిక రూపొందించిన రోజే ఈ నెల ఒకటో తేదీన రాహుల్‌గాంధీ మేడిగడ్డ బరాజ్ వద్దకు హెలిక్యాప్టర్‌లో వెళ్లి హైడ్రామా సృష్టించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి వెళ్లి చేసిన హంగామా రణరంగాన్ని తలపించింది. రాహుల్ వెంట మేడిగడ్డ వెళ్లి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వెంటనే నివేదిక ఇవ్వాలని డిమాండు చేశారు. అంటే నివేదిక అంశం ముందుగానే కాంగ్రెస్ నేతలకు కూడా లీకైనట్టు దీని ద్వారా స్పష్టమవుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మోదీ 7న రాష్ర్టానికి వస్తున్నారు. ఇందుకోసమే హడావుడిగా ఈ నివేదికను విడుదల చేసినట్టు తెలుస్తున్నది. దీనిని అడ్డంపెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై రాజకీయంగా మోదీ దాడి చేయనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా.. ఇతర పార్టీల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి చేరకపోవడం ఢిల్లీ పెద్దలను కలవరపెడుతున్నది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ బలిపీఠంపై పెట్టి రాజకీయ దాడికి పథక రచన చేసింది. ఈ పరిణామాలన్నీ అందులో భాగమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2022లో మేడిగడ్డ బరాజ్ డిజైన్ డిశ్చార్జి 28.25 లక్షల క్యూసెక్కుల కంటే అదనంగా 50వేల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడింది. ఆ విషయం తెలిసినా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్ ఫౌండేషన్ సరిగా లేదని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు.
గత ఐదు సీజన్లుగా తెలంగాణ రైతాంగానికి గోదావరి జలాలను అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీలు ముందునుంచీ కుట్రల కత్తులు దూస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఆదినుంచీ కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు కేసులు, ఆందోళనలు, నిరసనలు.. ఇలా అనేక రూపాల్లో అడ్డుకునేందుకు యత్నించి విఫలమయ్యాయి. ఇప్పుడు మేడిగడ్డ వద్ద తలెత్తిన చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకొని కుట్ర రచనను సాగిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రానికి ఎప్పుడూ చిన్నపాటి లేఖ రాయని కిషన్‌రెడ్డి కాళేశ్వరంపై గత నెల 22న ఆగమేఘాల మీద లేఖ రాశారు. ఆ వెంటనే అదే రోజు కేంద్రం ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ వేసింది.