హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): కులగణనపై ప్రజెంటేషన్ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అభినందించారు. పలుమార్లు ఆయన పేరు ప్రస్తావిస్తూ ప్రశంసించారు. దీంతో చూసేవాళ్లకు రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి తగ్గిందనే అభిప్రాయం కలగడం సాధారణం.
అయితే ఇదంతా బయటకు కనిపించిన తతంగమేనని, లోపల మాత్రం సీన్ వేరేగా ఉందనే టాక్ పార్టీలో వినిపిస్తున్నది. పైకి ప్రేమగా కనిపించిన రాహుల్‌గాంధీ లోలోపల మాత్రం అంతే కోపంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ప్రజెంటేషన్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల నుంచి కాంగ్రెస్ ఎంపీలు, కీలక నేతలు హాజరయ్యా రు. దీంతో పాటు కులగణన అంశం జాతీయస్థాయిలో ప్రాధాన్యం కలిగిన అంశం కావడంతో రాహుల్‌గాంధీ తన పాత్రను మార్చుకున్నారనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇంత ప్రాధాన్యం కలిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై తన అసంతృప్తిని ప్రదర్శిస్తే జాతీయస్థాయిలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో రేవంత్‌రెడ్డిపై మెతక వైఖరి అవలంబించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే, బీజేపీ ముందు చులకనవుతామనే ఉద్దేశంతో తన తీరుకు భిన్నంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణనపై ప్రజెంటేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డితో కాకుండా భట్టి విక్రమార్కతో ఇప్పించాలని రాహుల్‌గాంధీ ఆదేశించినట్టు తెలిసింది.
వాస్తవానికి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నుంచి మరోసారి భంగపాటు తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కులగణనపై పార్టీ పెద్దలతో పాటు ఎంపీలకు వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డితో రాహుల్‌గాంధీ అంటీముట్టనట్టుగానే వ్యవహరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తొలుత జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిని పెద్దగా లెక్క చేయలేదని తెలిసింది.
వ్యక్తిగతంగా కలిసే అవకాశం రేవంత్‌రెడ్డికి ఇవ్వలేదని సమాచారం. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకు రేవంత్ ఎంత ప్రయత్నించినా ఆయన మాత్రం అవకాశం ఇవ్వలేదని తెలిసింది. రేవంత్‌రెడ్డి వైపు చూడడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ సమావేశంలో కులగణనపై తనకున్న సందేహాలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించారే తప్ప రేవంత్‌రెడ్డిని మాట్లాడించలేదని తెలిసింది.
కనీసం పుష్పగుచ్ఛం ఇచ్చే అవకాశం కూడా రేవంత్‌రెడ్డికి ఇవ్వలేదనే చర్చ జరుగుతున్నది. రాహుల్‌గాంధీకి భట్టివిక్రమార్క పుష్పగుచ్ఛం ఇవ్వగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు రేవంత్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డితో రాహుల్ సఖ్యతగా లేరని చెప్పడానికి పార్టీలో మరో చర్చకూడా జరుగుతున్నది. సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి తన ట్విటర్ ఖాతాలో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకగాంధీతో కలిసిన ఫొటోను షేర్ చేశారు. ప్రియాంకగాంధీని కలిసి కులగణన వివరాలు వివరించినట్టుగా తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ, ఖర్గేలతో సమావేశం జరిగితే ప్రియాంకగాంధీతో ఉన్న ఫొటో షేర్చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కి, సీఎం రేవంత్‌రెడ్డికి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ కొన్ని నెలలుగా జరుగుతున్నది. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఢిల్లీలో కులగణనపై ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాటలు విని పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సమావేశంలో రాహుల్ జపం చేసిన రేవంత్‌రెడ్డి ఆయనను ఆకాశానికెత్తేశారు. సోనియా, రాహుల్‌ను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయపడ్డారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.