నవంబర్ 25, 2023
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో పర్యటించారు. నిరుద్యోగులను కలిసి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నాటి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక బావర్చి హోటల్లో బిర్యానీ తిందామంటూ వారికి చెప్పారు.
నవంబర్ 5, 2024
రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా తమను కలుసుకునేందుకు మరోసారి అశోక్‌నగర్‌కు రావాలంటూ నిరుద్యోగులు కోరారు. ప్రస్తుత ప్రభుత్వం తమను పెడుతున్న ఇబ్బందులను వినాలని వారు చేసిన విజ్ఞప్తిని ఆయన పట్టించుకోలేదు. కేవలం ఓ సమావేశానికి హాజరై ఆయన వెనుదిరిగారు. ఆయను కలిసేందుకు ప్రయత్నించిన పలువురు నిరుద్యోగులను పోలీసులు బయటకు రాకుండా నిర్బంధించారు.
హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు నిరుద్యోగుల వద్దకు వచ్చిన రాహుల్‌గాంధీ అరచేతిలో వైకుంఠం చూపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని నాడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఒక్కో అభ్యర్థి భుజాన్ని తడుతూ తానున్నానని నమ్మబలికించారు. నాడు అశోక్నగరంతా రాహుల్ కోసం ఎదురుచూస్తుందన్నట్టుగా ఆ పార్టీ నాయకులు బిల్డప్ ఇచ్చారు. అభ్యర్థులు సైతం ఆ మాయలో పడి కాంగ్రెస్ నేతల డొల్ల మాటలు విశ్వసించారు. తాజా పర్యటన నేపథ్యంలో అశోక్‌నగర్‌కు ఒక్కసారి రావాలంటూ అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా కోరారు.
“రాహుల్ గాంధీ మీరు మాకిచ్చిన హామీలు నెరవేరలేదు. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే మాపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. మమ్మల్ని పోలీసులతో కొట్టించారు. తలలు పగలగొట్టించారు. జర మీరొచ్చి మా గోడు వినండి. మీరు మాకు ఇచ్చిన హామీలను ఈ రేవంత్ సర్కార్‌కు గుర్తు చేయండి.” అంటూ అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా వేడుకొన్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో అశోక్‌నగర్‌ను పోలీసులు చుట్టముట్టారు. ఏ ఒక్క అభ్యర్థి రోడ్డుపైకి రాకుండా పోలీసులు నిర్బంధం విధించారు. నాడు తియ్యని కబుర్లు చెప్పి, ఉద్యోగాలేవని ప్రశ్నిస్తే ముఖం చాటేసిన రాహుల్‌గాంధీ తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాక కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరుద్యోగులు నిరీక్షించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి రెస్టారెంట్లో వేచిచూశారు. ఆయన రాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిగారు. కాంగ్రెస్ తమను నమ్మించి మోసం చేసిందని నిరుద్యోగులు వాపోయారు. త్వరలోనే తమ కార్యాచరణను ప్రకటించి, ఢిల్లీ వెళ్లి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.