ఓటు చోరీ గురించి దేశవ్యాప్తంగా నీతులు చెప్తున్న రాహుల్‌గాంధీ, తెలంగాణలో ఎమ్మెల్యే చోరీ గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం. రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక ప్రక్రియలో పాలుపంచుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. చట్టాలపై ఏ మాత్రం గౌరవమున్నా అనర్హత వేటును తప్పించుకొనేందుకు పార్టీ మారలేదని నిస్సిగ్గుగా బుకాయిస్తున్న బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరుపై స్పందించాలి.-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘రాహుల్జీ..ఓట్ల చోరీపై జాతీయ స్థాయిలో గగ్గోలు పెడుతున్న మీరు..తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై ఎందుకు మౌనం వహిస్తున్నరు? పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను మీరు కలవలేదా? వారు మెడలో వేసుకున్నది కాంగ్రెస్ కండువాలు కాదా? బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఇప్పుడు పార్టీ మారలేదని చెప్తున్న అబద్ధాలను సమర్థిస్తారా? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రవచనాలు వల్లించే మీకు ద్వంద్వ వైఖరి ఎందుకు?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫొటోలను శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘వీరిని మీరు గుర్తుపట్టడంలేదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకుంటే ఇంకేంటి?’ అని నిలదీశారు. ‘మీరు జాతీయస్థాయిలోలేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే ఇది దారుణమైన నేరం’ అని స్పష్టంచేశారు.
తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై రాహుల్‌గాంధీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుకాయిస్తున్న ఫిరాయింపుదారుల తీరుపై స్పందించాలని డిమాండ్ చేశారు. నిర్లజ్జగా ఫిరాయింపు రాజకీయాలు చే స్తూ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ తలవంపులు తెస్తున్నందుకు రాహుల్ తలదించుకోవాలని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంటే పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చోటే భాయ్‌కి బడే భాయ్ పహారా
తెలంగాణలోని చోటే భాయ్‌కి ఢిల్లీలోని బడే భాయ్ పహారా కాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ సీఎంకు చీమకుట్టకుండా బీజేపీ కాపాడుతున్నదని దుయ్యబట్టారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా రేవంత్‌రెడ్డి ఎన్ని స్కాంలకు పాల్పడ్డా బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని దెప్పిపొడిచారు. గ్రూప్-1 అ వకతవకలపై ఆ పార్టీ స్పందించకపోవడమే నిదర్శనమని విమర్శించారు. పరీక్ష రద్దుచేయాలని హైకోర్టు ఆదేశించినా బీజేపీ రాష్ట్ర నేతలు నోర్లెందుకు తెరవడంలేదని నిలదీశారు. ‘విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి, నేరపూరిత నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడంలో ఆంతర్యమేమిటి? పరీక్షలు రద్దు చేయాలని నిరుద్యోగలోకం గగ్గోలు పెడుతుంటే మౌనమెందుకు?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో చీటికి మా టికీ సీబీఐ విచారణ చేయించాలని ఒంటికాలిపై లేచిన ఆపార్టీ నేతలు కాంగ్రెస్ స్కాంలపై ఎందుకు సీబీఐ విచారణ కోరడంలేదని నిలదీశారు. గ్రూప్-1 ఉదంతమే రేవంత్-బీజేపీల రహస్య మైత్రికి తాజా ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.