కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కూడా నెలలుగా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య నలిగిపోతూనే ఉన్నది. సీఎం, మంత్రులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కొత్త పేరు తెరమీదికి వస్తున్నది. ఈరోజు సాయంత్రం ప్రకటన వస్తుంది.. అంటూ ఎన్నో రోజులుగా ఊరిస్తూనే ఉన్నారు. ఆశావహులకు టికెట్ ఖర్చులు తప్ప అక్కడ తేలిందేమీ లేదు.
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ నేతల నోళ్లలో నానుతున్న మాట ఇది. ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకొని హైదరాబాద్- ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఈ విషయం మీదనే ఐదారుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఓ దశలో మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. కానీ ఇప్పటివరకు తేలలేదు.
త్వరలో రాహుల్‌గాంధీ వస్తారు.. ఇది కూడా ఎదురుచూపుల తంతుగానే మిగిలిపోయింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అంటూ నెలలుగా ఊదరగొడుతున్నారే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేశామని, నెలాఖరులో సభ నిర్వహిస్తామని చెప్పినా.. రాహుల్ ‘ఉహూ’ అనడంతో వెనక్కి తగ్గక తప్పలేదు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ.. ఇప్పటివరకు వారు బాధ్యతలు తీసుకోలేదు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే ఇందుకు కారణమని చర్చ జరుగుతున్నది.
CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు జోరుగా ప్రచారం సాగుతున్నది. ఢిల్లీ పెద్దలు కొన్ని రోజులుగా రేవంత్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఇందుకు పైన పేర్కొన్న ఘటనలను ఉదాహరణలుగా చెప్తున్నారు. ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొన్నదని అంటున్నారు.
ఏవేవో ప్రయత్నాలు చేసి ఆపాయింట్ తీసుకున్నా.. ఎక్కువ సమయం కూడా ఇవ్వడం లేదని సమాచారం. గతవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కలిసి ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీని కలిశారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై కాకుండా హర్యానా ఎన్నికల బాధ్యతలను అప్పగించేందుకు మాత్రమే ఆపాయింట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ర్టాల్లో మాత్రమే అధికారంలో ఉన్నది. అవే.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్.
ఇందులో రాజకీయంగా, ఆర్థికంగా హిమాచల్ ప్రదేశ్‌ను మిగతా రెండు రాష్ర్టాలతో పోల్చలేము. ఇక కర్ణాటకలో రాజకీయంగా అంతర్గత కుమ్ములాటలు, వరుస కుంభకోణాలతో పార్టీ పతనం అవుతుండగా.. ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉండటం, పాలన అస్తవ్యస్తంగా మారడంతో అధిష్ఠానానికి నిధులు సమకూరే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏ కోణంలో చూసినా తెలంగాణే కీలకం. అలాంటప్పుడు అధిష్ఠానం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పరపతి పతాక స్థాయిలో ఉండాలన్నది విశ్లేషకుల మాట. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు.
చెల్లుబాటుకాని రేవంత్ మాట!
ఎన్నికల ముందు వరకు రేవంత్‌రెడ్డికి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో మంచి సంబంధాలు ఉండేవి. ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఏది చెప్తే అదే సాగింది. సీనియర్ నేతలను కాదని ఆయన చెప్పినవారికే టికెట్లు ఇచ్చిన ఘటనలు ఎన్నో. రేవంత్ ఎక్కడ సభ పెట్టి పిలిచినా గాంధీ కుటుంబం వచ్చి ప్రచారం చేసింది. రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ హవా కొనసాగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని, ‘ఎంత చెప్తే అంత అనే స్థాయి నుంచి.. ఎంత చెప్పినా ఉత్తదే’ అన్నట్టుగా తయారైందని అంటున్నారు. కీలక అంశాలన్నీ పెండింగ్‌లో ఉండడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ ఇచ్చిన జాబితాపై అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. అందుకే ఆరు నెలలుగా వాయిదాలు వేస్తున్నట్టు తెలిసింది. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. జూలై 4న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ ఢిల్లీ పెద్దలు ఆమోదం తెలపకపోవడంతో చివరి క్షణంలో వాయిదా వేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత ‘ఆషాఢ మాసం’ అంటూ కొత్త పాట మొదలుపెట్టారు. ఆగస్టులో పక్కా అంటూ లీకులు ఇచ్చారు. శ్రావణ మాసం ముగిసినా అధిష్ఠానం ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని చెప్తున్నారు. పీసీసీ చీఫ్ పదవిపైనా ఇదే తతంగం. రేవంత్‌రెడ్డి తన అనుచరుడికి పదవి ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఢిల్లీ పెద్దలు అందుకు ససేమిరా అంటూ జిల్లాలు, సామాజిక వర్గాలు, సమీకరణలు అంటూ కాలం గడుపుతున్నదని సమాచారం.
ఒకవేళ సీఎం రేవంత్‌రెడ్డి బలంగా ఉండి ఉంటే, అధిష్ఠానం వద్ద ఆయన మాట చెల్లుబాటైతే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపిక ఎప్పుడో పూర్తయ్యేవన్నదని రాజకీయ విశ్లేషకుల మాట. గతంలో రేవంత్ జాబితా పంపినా ఢిల్లీ పెద్దలు ఆమోదించి, పదవులు కట్టబెట్టేవారని, ఇప్పుడు ‘మీరు చెప్పాల్సింది చెప్పారు.. మేం చేసేటప్పుడు చేస్తాం’ అని ముఖంమీదే చెప్తున్నారని పార్టీలో చర్చ నడుస్తున్నది. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహారుగా, గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినా, అధిష్టానం పచ్చజెండా ఊపకపోవడంతో వారి ప్రమాణ స్వీకారానికి బ్రేకులు పడ్డాయన్న చర్చ జరుగుతున్నది.
రమ్మంటే వస్తలేరు.. వెళ్లినా కలుస్తలేరు
ఒకప్పుడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఎప్పుడు, ఎక్కడికి వచ్చి ప్రచారం చేయమన్నా వచ్చారని, ముఖ్యంగా రాహుల్‌గాంధీ బలపం కట్టుకొని తెలంగాణలో తిరిగారని అంటున్నారు. అయితే సీఎంగా అధికార పగ్గాలు అందుకున్న తర్వాత రేవంత్ వ్యవహార శైలిపై పార్టీలోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు వస్తుండడంతో ‘గాంధీ’ కుటుంబం క్రమంగా దూరం పెట్టినట్టు చర్చ జరుగుతున్నది.
రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా క్షణాల్లో రాహుల్‌గాంధీతో పాటు ఇతర పెద్దల అపాయింట్మెంట్ లభించేదని, కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి గంటలు, రోజుల తరబడి పడిగాపులు కాసినా ఆపాయింట్మెంట్ దొరకడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ దొరుకలేదని.. చివరికి అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి సాయంతో కలువగలిగారని చెప్పుకుంటున్నారు. తిరిగి వచ్చే సమయంలో ‘నాకు ఒక సాయం కావాలి’ అంటూ ఆ నేత కోరగా, తెలంగాణకు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పడంతో ఆయన రాష్ర్టానికి వచ్చి వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు రుణమాఫీ సభకు రావడంపైనా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నట్లుగా తెలిసింది. అరకొర రుణమాఫీ చేయడం, రైతుల్లో వ్యతిరేకతపై రాహుల్‌గాంధీకి రాష్ట్ర పార్టీకి చెందిన నేతలే నివేదిక అందించినట్టు చెప్పుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి మూడుసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా రాహుల్ మొహం చాటేసినట్టు తెలిసింది. రుణమాఫీ పూర్తి కాలేదని, రైతులు వ్యతిరేకంగా ఉన్న సమయంలో తానెలా వస్తానని అన్నట్టు సమాచారం.
అందుకే మాఫీ సభ ఇప్పటివరకు నిర్వహించలేకపోయారు. ఆగస్టు 20న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని రేవంత్‌రెడ్డి భావించారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకగాంధీని పిలుస్తున్నట్టు చెప్పారు. అయితే వారు స్పందించలేదని, దీంతో విగ్రహావిష్కరణను వాయిదా వేసినట్టు సమాచారం.
కోరి తెచ్చుకున్న కష్టాలు
సీఎం రేవంత్ ప్రస్తుత పరిస్థితికి పూర్తిగా ఆయనదే బాధ్యత అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీ గురించి కాకుండా, తన సొంత ఇమేజీ కోసం నిర్ణయాలు తీసుకోవడం, అతిగా ప్రచారం చేసుకోవడం, ప్రభుత్వంలో ఒంటెత్తు పోకడలతో అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి వ్వవహారశైలి ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారుతున్నదని అంటున్నారు.
పార్లమెంట్ సీట్లు రాకపోవడం
అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా గెలుస్తామని రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పారని, అన్నట్టుగానే అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. దీంతో అధిష్ఠానం ఆయనను గుడ్డిగా నమ్మిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సీనియర్లను పక్కనబెట్టి ఎవరికి టికెట్ ఇవ్వమంటే వారికి ఇచ్చారని చెప్తున్నారు. 12 సీట్లు, 14 సీట్లు అంటూ ఊదరగొట్టారని.. చివరికి 8 సీట్లకే పరిమితం కావడంతో ఢిల్లీ పెద్దలు షాక్ అయినట్టు సమాచారం. సీఎం సొంత నియోజకవర్గం, ఎంపీ సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విచారణ కమిటీని కూడా వేసిందని గుర్తు చేస్తున్నారు. ‘రేవంత్‌కు రాష్ట్రంలో అంత సీన్ లేదు’ అనే భావన ఏర్పడిందని అంటున్నారు.
పార్టీ ఫండ్‌పై భారీ ఆశలు
తెలంగాణతోపాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు పార్టీకి నిధులు సమకూర్చగలిగేవి కర్ణాటక, తెలంగాణ మాత్రమే. కర్ణాటక ఆర్థిక పరిస్థితిని చూస్తే అక్కడ పెద్దగా వసూలయ్యే పరిస్థితి లేదు. ఆ రాష్ట్ర సీఎం కుంభకోణంలో ఇరుక్కోవడం, సీఎం కుర్చీ కోసం కొట్లాడుకోవడం తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కామధేనువుగా కనిపిస్తున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణకు భారీస్థాయిలో నిధుల సమీకరణ టార్గెట్ పెట్టారని, కానీ ఆ స్థాయిలో సాధ్యం కాదని చేతులెత్తేస్తుండడంతో ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
రాజీవ్ విగ్రహం.. బూమరాంగ్
సీఎం రేవంత్‌రెడ్డి కొన్నాళ్లుగా అధిష్ఠానాన్ని మచ్చిక చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన 8 నెలల్లో 20 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. మరే ఇతర సీఎం కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లిన సందర్భాలు లేవని విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీ పెద్దలతో చెడిన తర్వాత రాకపోకలు ఎక్కువయ్యాయని చర్చ జరుగుతున్నది. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నట్టు చెప్తున్నారు. అందుకే, సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు అంశాన్ని హఠాత్తుగా తెరమీదికి తీసుకొచ్చారని అంటున్నారు.
విగ్రహావిష్కరణకు సోనియా, రాహుల్, ప్రియాకను పిలిచి మచ్చిక చేసుకుందామని భావించినట్టు సమాచారం. అయితే తెలంగాణ తల్లి విగ్రహం కోసంకేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపించాయని చెప్తున్నారు. దీంతో రేవంత్ ప్లాన్ బూమరాంగ్ అయింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానాన్ని తిరిగి ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక రేవంత్‌రెడ్డి సతమతం అవుతున్నట్టు చర్చ జరుగుతున్నది.
అన్నదమ్ముళ్ల వ్యవహారశైలి
సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్‌రెడ్డి సీనియర్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ మొండివైఖరి ప్రదర్శిస్తుండడంపై అధిష్ఠానానికి వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. మరోవైపు రేవంత్ సోదరుల వ్యవహారంపైనా అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రయాణించడం మొదలు, ఇటీవల అమెరికా పర్యటనలో సీఎం తమ్ముడికి చెందిన స్వచ్ఛ్ బయోగ్రీన్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం వరకు అన్ని అంశాలు అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు వెళ్తున్నాయని చెప్పుకుంటున్నారు.
చక్రం తిప్పుతున్న ఖర్గే..
రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే గుర్రుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ దూకుడు, టికెట్ల విషయంలో సీనియర్లను అగౌరవపరచడం వంటివి ఖర్గేకు నచ్చలేదని చెప్పుకుంటున్నారు. రాహుల్‌కు దగ్గర కావడంతో ఖర్గే సూచించిన కొన్ని పనులు, కార్యక్రమాలను కూడా రేవంత్ పక్కన పెట్టారని చర్చ జరుగుతున్నది. అప్పట్లో రేవంత్ బలంగా ఉండటంతో ఖర్గే ఓపికపట్టారని.. ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని అంటున్నారు.
వాస్తవానికి రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం, ఎదగడం, అధిష్ఠానం దగ్గర పరపతి పెరగడంలో కేసీ వేణుగోపాల్‌ది కీలకపాత్ర అన్నది కాంగ్రెస్ వర్గాల మాట. ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతున్న కేసీ వేణుగోపాల్‌ను కేరళ పీసీసీ అధ్యక్షుడిగా పంపి, రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్‌కి గాంధీల అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారిందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో వెనుక ఉండి నడిపించిన ఓ వ్యక్తి, ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఓ నేత తప్ప ఇప్పుడు రేవంత్‌రెడ్డికి ఢిల్లీలో పెద్దగా పరపతి లేదని సమాచారం.