Congress | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ కంగాళి సభను తలపించింది. అంతా గందరగోళం. అయోమయం. షరామాములుగానే ముఖ్యనేతలంతా స్టేజీపై పెత్తనం ప్రదర్శించేందుకు పోటీపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు రేణుకాచౌదరి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటివారికి ప్రాధాన్యం కరువైంది. దీంతో వారంతా చడి చప్పుడు లేకుండా కూర్చుండిపోయారు. సభలో ఎవరు ఎవర్ని లీడ్ చేస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి. ఫొటోలో కనిపించేందుకు నేతలంతా పోటీపడ్డారు. సీనియర్లు కూడా ఒకరినొకరు నెట్టుకున్నారు. ఒక దశలో భట్టి విక్రమార్క కింద పడబోయారు. సభ వేదిక ముందు అరుస్తున్న వారిని నిలువరించలేని పరిస్థితి. ఇక రాహుల్‌గాంధీ ప్రసంగం విన్న తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకున్నది. కనీస అవగాహన, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటంపై విస్మయం వ్యక్తమవుతున్నది. గురివింద గింజ మాదిరిగా కాంగ్రెస్ తప్పులను మర్చిపోయినట్టు నటించిన రాహుల్‌గాంధీ.. తెలంగాణలో ప్రజల ప్రభుత్వంపై నోరుపారేసుకున్నారు.
రండి బాబూ రండి.. మా పార్టీలో చేరండి
అసలు సిసలైన నాయకులెవరూ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా లేరు. ఎవరైనా అందులో చేరుతున్నారంటే వాళ్లు బీఆర్ఎస్ తిరస్కరించినవాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చితక నేతలు ఎవరొచ్చినా స్వాగతించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాహుల్‌గాంధీ కూడా తమ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని, ఎలాంటి షరతులు ఉండవని, పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో చేరేవాళ్లు లేకపోవడంతో చేరికల తలుపులను బార్లా తెరిచారనే వ్యంగ్యోక్తులు వినిపిస్తున్నాయి.
పక్కనే కరోడ్‌పతి, కాంట్రాక్టర్‌ను పెట్టుకొని..
రాహుల్‌గాంధీ తీరు గురివింద గింజ తీరును తలపిస్తున్నది. బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూపంలో పక్కనే బడా కాంట్రాక్టర్‌ను, కరోడ్‌పతిని పెట్టుకున్న ఆయన.. సీఎం కేసీఆర్ పక్కన అంతా కరోడ్‌పతులే ఉన్నారంటూ విమర్శలు చేశారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై వెటకారాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లంతా కూటికి గతిలేని నిరుపేదలేనా? రేవంత్‌రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలాంటి నేతలంతా పేదలేనా? అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దేశంలోని ఎమ్మెల్యేల్లోనే అత్యంత ధనవంతుడు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని ఇక్కడ విమర్శలు చేయడం ఏమిటని రాహుల్‌కు చురకలేస్తున్నారు.
పోడు పట్టాలు ఇస్తారట!
రాహుల్‌గాంధీ అవగాహనా రాహిత్యానికి పోడు పట్టాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి. తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఏమి జరుగుతున్నదో కూడా తెలుసుకోకుండా ప్రసంగించి నవ్వుల పాలయ్యారు. తెలంగాణ గిరిజనలకు పోడు పట్టాలు ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఇది విన్న జనం అవాక్కయ్యారు. కారణం.. ఇప్పటికే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 4,01,405 ఎకరాలకు సంబంధించి 1,50,224 మంది గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. రెండు రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ విషయం తెలియని రాహుల్‌గాంధీ.. ఇచ్చిన భూములకు మళ్లీ పోడు పట్టాలు ఇస్తామంటూ ప్రకటించారు.
మీది కదా… స్కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ స్కాంల గురించి, అవినీతి గురించి ఈ దేశంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. అవినీతికి మారుపేరుగా మారిన ఆ పార్టీ స్కాంగ్రెస్‌గా ప్రసిద్ధికెక్కింది. ఆలాంటి స్కాంగ్రెస్‌ను 206 ఎంపీ సీట్ల నుంచి 44 సీట్లకు దించారు దేశ ప్రజలు. అలాంటి పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ.. ప్రజలకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వంపై అడ్డగోలు అరోపణలు చేయడం విడ్డూరం. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. అసలు కాళేశ్వరం ఖర్చే రూ.80 వేల కోట్లంటూ ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్లో జవాబిచ్చింది. ప్రాజెక్టు ఖర్చే రూ.80 వేల కోట్లయితే.. లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో రాహుల్‌గాంధీకే తెలియాలి.