హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వరంగల్ సభలో రాహుల్వ్యాఖ్యలు చూస్తే ఆయనపై జాలేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పట్ట పగలు డబ్బు సంచుల తో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసిచ్చిన స్రిప్ట్ చదివి రాహుల్, తన అజ్ఞానాన్ని బయట పెట్టుకొన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నాయకులు లేక వలస వచ్చిన దొంగను పీసీసీ అధ్యక్షుడిగా పెట్టుకొన్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్‌తో ఊదు కాలదు-పీరి లేవదని పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకటనే హాస్యాస్పదమని, కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కరెంటు లేక రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరానికి 15 క్విం టాళ్ల ధాన్యమే కొంటున్నారని, రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ ఇంకా అమలుచేయలేదని ధ్వజమెత్తారు. రూ.2 లక్షల రుణమాఫీ గురించి రాహుల్ ఇప్పటికే మూడుసార్లు చెప్పారని, అయినా తెలంగాణ ప్రజలు నమ్మలేదని అన్నారు. ఇప్పుడు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అంటున్నారని, రైతుల కోసం ఏం చేయాలో రాహుల్ నోట పలికించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. జాతీయస్థాయిలో బీజేపీ వైఖరిని ఎండగడుతున్నది టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు.