Rahul Gandhi | హైదరాబాద్, డిసెంబర్ 15( నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో రహస్యంగా కలుసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలోని ముఖ్య నేతలకు, మల్టీనేషనల్ కంపెనీ వ్యాపారవేత్తకు మధ్య ఉన్న అనుబంధం, తెలంగాణలో ఆ గ్రూప్ పెట్టుబడుల మీదనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్యూచర్సిటీలో ఏమి జరుగుతున్నదో పక్కా వివరాలు కావాలని రాహుల్‌గాంధీ అడిగి తీసుకున్నట్టు సమాచారం. రాహుల్‌గాంధీ అడిగిన అన్ని వివరాలను ఉప ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న ఆధారాలతో వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరూ కలిసే ఢిల్లీ వెళ్లేవారు. ఎవరిని కలవాలన్నా ఒకే కారులో వెళ్లి వచ్చేవారు. హైదరాబాద్‌కు కూడా కలిసే వచ్చేవారు. కానీ, ఈసారి ఇద్దరూ వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బంధువుల పెండ్లికి రాజస్థాన్ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అటునుంచి ఢిల్లీకి చేరుకునే సరికి, భట్టి విక్రమార్క తన ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి రావడం వెనుక రహస్యం ఏమిటంటూ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి కంటే ముందే ఢిల్లీకి వెళ్లిన భట్టి విక్రమార్క.. రాహుల్‌గాంధీని కలవడం, పనిగట్టుకొని ఢిల్లీ మీడియాను పిలిచి రాహుల్‌గాంధీని తాను కలవలేదని చెప్పడంతో అసలు ఏమి జరిగి ఉంటుంది? అని ఆ పార్టీ శ్రేణులను ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భట్టి విక్రమార్క కంటే ముందు మంత్రి సీతక్క ఢిల్లీకి వెళ్లారు. ఆమె కోరిన వెంటనే రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన తరువాత భట్టి వెళ్లారు. వీరికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా? లేక వీరంతట వీరే వెళ్లి రాహుల్‌గాంధీని కలిశారా? అనే అంశం మీద పార్టీ శ్రేణలు ఆరా తీయగా.. భట్టి విక్రమార్కను అధినేతే పిలిపించినట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా తీరును రాహుల్‌గాంధీ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
ప్రధానంగా మల్టీనేషనల్ వ్యాపారవేత్తతో రాష్ట్ర ముఖ్య నేతకు ఉన్న అనుబంధం, రాష్ట్రంలో ఆ.. గ్రూప్ పెట్టుబడులు, వ్యాపార లావాదేవీల మీద వివరాలు అడిగినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఫ్యూచర్‌సిటీలో ఏమి జరుగుతున్నదని, అక్కడ ఆ.. గ్రూప్‌ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారని ఆరా తీసినట్టు తెలిసింది. నల్లగొండ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రతిపాదనలు ఎవరి ద్వారా వచ్చాయని, ప్రజా తిరుగుబాటు వస్తున్నా ఎందుకు మొండిగా ముందకెళ్తున్నారని, అసలు దావోస్ మీటింగ్‌లో ఏమి జరిగిందనే అంశాలపై రాహుల్‌గాంధీ అడిగినట్టుగా తెలిసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆ..గ్రూప్‌కి యాంటీగా స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో ఆయనంటే మనకెందుకు ప్రత్యేకమని అడిగినట్టు తెలిసింది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టటానికే సీఎం రేవంత్‌రెడ్డి 28వ సారి ఢిల్లీకి వెళ్లారని సీఎంవో వర్గాలు మీడియాకు లీకులు ఇస్తున్నాయి. కాంగ్రెస్ అనుకూల మీడియాలో కూడా సీఎం నిధులు రాబట్టడం కోసమే ఢిల్లీ టూర్ వెళ్లారనే అంశాన్నే హైలెట్ చేశారు. నిజంగా నిధుల కోసమే అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క కూడా సీఎంతో పాటు వెళ్లాల్సి ఉంటుందని, ఆర్థికమంత్రి లేకుండా నిధుల సమీకరణ అంశం ఏమి ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కాగా, రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి మూడు రోజులు ఎదురుచూసినా ఆయనతో ముఖాముఖి దొరకలేదనీ, చేసేదేమీలేక ఆయన సైలెంట్‌గా హైదరాబాద్ తిరిగొచ్చారనే ప్రచారం జరుగుతున్నది. గతంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదట! కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రాహుల్ పిలిపించి మాట్లాడినట్టు తేలడంతో కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతున్నదనే ఉత్కంఠ మొదలైంది.