Rahul Gandhi | హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): దేశంలో అన్ని చోట్లా కుల వివక్ష ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. కుల వివక్షతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో అసమానతలకు కుల వివక్ష కారణమ ని వివరించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన కులగణనపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మే ధావులు, కుల సంఘాల నేతల అభిప్రాయాల ను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. మన దేశంలో ఇంకా దళితుడిని అంటరానివాడిగా చూసే పరిస్థితి ఉన్నదని చెప్పారు. అయితే అగ్రవర్ణాల్లో మాత్రం కుల వివక్ష లేదని పేర్కొన్నారు.
కులగణనను వ్యతిరేకిస్తున్న వారంతా కుల వివక్షకు అనుకులంగా ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఎందుకు కులగణన చేయడం లేదని, ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని, రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దనే నిబంధనను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిబంధన వల్ల బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్‌మాడల్‌గా ఉండాలని ఆకాంక్షించారు.
బ్యూరోక్రటిక్ కులగణన చేయొద్దని, పేదల కోణంలో కులగణన జరగాలని సూచించారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగొచ్చని, వాటిని సరి చేసుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ.. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయం గా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని చెప్పారు. కులగణన చేపడతామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్టు తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే అడుగు ముందుకు వేశారని పేర్కొన్నారు.