హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుపై వివక్షను కాంగ్రెస్, రాహుల్‌గాంధీ మరోసారి బయటపెట్టారు. హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి, దళిత నాయకుడు దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించిన రాహుల్ అదే సమయంలో పీవీ నరసింహారావుకు నివాళి అర్పించడాన్ని మర్చిపోవడం గమనార్హం. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్ శనివారం ఉదయం సంజీవయ్య పార్క్‌కు వెళ్లి ఆయనకు నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గానికి చెందిన మహోన్నత నేతకు నివాళి అర్పించడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమైంది. అదే సమయంలో అసంతృప్తి కూడా వ్యక్తమైంది.
దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించిన రాహుల్.. మాజీ ప్రధాని, మాజీ సీఎం, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ముద్దు బిడ్డ అయిన పీవీ నరసింహారావును మర్చిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజీవయ్య పార్క్‌కు పక్కనే ఉన్న పీవీ ఘాట్ వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. సంజీవయ్యకు నివాళి అర్పించడం మంచిదే కానీ, అదే సమయంలో పీవీని మర్చిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడుతున్నారు. దీనిని బట్టి పీవీపై కాంగ్రెస్ పార్టీకి కోపం ఇంకా తీరినట్టు లేదనే విమర్శలు వినవస్తున్నాయి. పీవీ తెలంగాణ ముద్దు బిడ్డ కాబట్టే.. ఆయనను రాహుల్ మర్చిపోయారనే ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ నేతలపై రాహుల్‌కు గల చిన్న చూపు బహిర్గతమయిందని అంటున్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన పీవీకి ఢిల్లీలో కనీసం సమాధి లేకుండా చేశారని, ఇప్పుడు హైదరాబాద్‌లో ఆయన సమాధికి కనీసం దండం కూడా పెట్టరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.