సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి పరాభవం ఎదురైంది. ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. మూడురోజులపాటు ఎదురుచూసినా కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో రాహుల్ గాంధీ రెండుసార్లు చర్చలు జరపడం గమనార్హం. పైగా మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్‌ను కలవగా, రేవంత్‌కు కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసుమంతైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏమిటని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Revanth Reddy | హైదరాబాద్, మే26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే పిలిపించుకొని, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీయడం కనీస మర్యాద. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 44సార్లు ఢిల్లీకి వెళ్లినా ఒకటిరెండుసార్లు మినహాయిస్తే ప్రతిసారి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండామొహం తిప్పేసుకోవడం వెనుక కారణం ఏమిటన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. తాజా పర్యటనలో ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ సీఎం రేవంత్‌రెడ్డి తరఫున రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రి వర్గ కూర్పు, రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై చర్చించాలని రేవంత్ భావిస్తున్నారని, 30 నిమిషాలు అపాయింట్మెంట్ అడుగుతున్నాని రాహుల్‌కు వివరించినట్టు తెలిసింది.
ఈ ప్రతిపాదనపై రాహుల్ సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. పైగా రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదానీతో సత్సంబంధాలు కొనసాగించడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. తరుచూ ప్రధానిని కలుస్తున్నారని, కానీ ఒక్కసారి కూడా బీసీ ఎజెండా మీద మోదీతో చర్చించలేదని, ఇది కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ ఏజెండాను నీరుగార్చడమేనని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చర్చ జరుగుతున్నది. పైగా సీఎం వరుస విదేశీ పర్యటనలపైనా రాహుల్ అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.
నేను చెప్పినవారికి పదవులిస్తేనే..
మంత్రివర్గ విస్తరణ జాబితాలో సుదర్శన్‌రె డ్డి, గడ్డం వివేక్, ఆది శ్రీనివాస్, ఫహాం ఖురేషీ పేర్లు ఉన్నట్టు సమాచారం. అయితే పార్టీ అవసరాల దృష్ట్యా గతంలో కొందరికి పదవులు ఇస్తామని మాట ఇచ్చామని, వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని సూచించి నా రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదని రాహుల్ ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మక్తల్ ఎమ్మె ల్యే వాకిటి శ్రీహరికి చోటు ఇవ్వాలని గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి ప్రతిపాదించార ని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం శ్రీహరి పేరును సూచించినట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుం చి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రం గారెడ్డిల్లో ఒక్కరినైనా మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం.
ముస్లిం మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అమేర్ అలీఖాన్‌కు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్టు చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ రూపొందించిన జాబితాలో ఒక్కరి పేర్లు కూడా లేకపోవడంపై రాహుల్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఎలాంటి పదవి లేని ఫహాం ఖురేషికి ఏకంగా మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించినట్టు చెప్పుకుంటున్నారు. చివరికి.. రాహుల్ స్వయంగా నలుగురి పేర్లను సిఫారసు చేసినట్టు సమాచారం. ఆ నాలుగు పేర్లకు అంగీకారం తెలిపితేనే అపాయింట్మెంట్ ఇస్తానని తెగేసి చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వేణుగోపాల్ క్లాస్?
రేవంత్‌రెడ్డి ఆదివారం మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యార ని, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, ఇతర అంశాలపై చర్చలు జరిపినట్టు తెలిసింది. కేసీ వేణుగోపాల్ కొన్ని సవరణలు, సూచనలు చేసినట్టు సమాచారం. ఈ మేరకు రేవంత్ సోమవారం మరోసారి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారని, పీసీసీ కార్యవర్గ జాబితాలో మార్పులు చేసినా, మంత్రివర్గ విస్తరణ జాబితాను మాత్రం యథాతథంగా ఉంచినట్టు చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్య దాదాపు రెండు గంటలు చర్చలు సాగినట్టు తెలిసింది. వేణుగోపాల్ మాట్లాడుతూ మీ నిర్వాకం వల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ బలపడుతున్నదని, ఈ అంశంలో అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నదని చెప్పినట్టు సమాచారం.
అవినీతి ఆరోపణలు, తొందరపాటు నిర్ణయాలు, అనవసర విదేశీ పర్యటనలు ఇందుకు ప్రధాన కారణమని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వ్యవహారశైలి ఇబ్బందిగా ఉన్నదని, ఆమె మరో పవర్ సెంటర్‌గా మారుతున్నదని, ఆమెను తొలగించాలని రేవంత్‌రెడ్డి కోరినట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రతిపాదన పట్ల కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారని, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదనే ఆమెను నియమించారని, అలాంటి వ్యక్తిని తొలగించాలని ఎలా అడుగుతారని ప్రశ్నించినట్టు సమాచారం. చర్చలు ముగిసిన తర్వాత మహేశ్‌కుమార్‌గౌడ్‌ను వెంట బెట్టుకొని కేసీ వేణుగోపాల్ సోమవారం రాహుల్‌ను కలిసినట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాహుల్, మంత్రి వర్గ విస్తరణ జాబితాను పక్కన పెట్టినట్టు తెలిసింది.
నన్ను చులకన చేయడానికే ఇదంతా?
రాహుల్ సిఫారసు చేసిన నలుగురిలో ముగ్గురి పట్ల రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చర్చ జరుగుతున్నది. ఇందుకు కారణాలను కలిసి వివరిస్తానని మూడు రోజులు ఎదురుచూసినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇదే సమయంలో మహేశ్‌కుమార్ గౌడ్‌ను రాహుల్ గాంధీ రెండుసార్లు కలవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన ప్రాబల్యాన్ని తగ్గించటానికే అధిష్టానం వ్యూహాత్మకంగా ఇలా చేస్తున్నదని సీఎం తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఏదేమైనా సరే ముగ్గురిని మంత్రులుగా అంగీకరించే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్‌కు తెగేసి చెప్పి, రేవంత్‌రెడ్డి వెనుదిరిగినట్టు సమాచారం.దీంతో హస్తిన కేంద్రంగా మూడు రోజులపాటు కాంగ్రెస్ చేసిన హైడ్రామా తుస్సుమన్నది. మంత్రివర్గ కూర్పు, పీసీసీ కార్యవర్గ ఏర్పాటుపై నిర్ణయాన్ని ఈ నెల 30వ తేదీకి అధిష్ఠానం వాయిదా వేసినట్టు తెలిసింది. ఆ రోజున రాష్ట్ర కీలక నేతలంతా ఢిల్లీకి రావాలని చెప్పినట్టు సమాచారం.
దాల్ మే కుచ్ కాలా హై
పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ కాబట్టే రేవంత్‌ను కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌తో రాహుల్ భేటీ అయ్యారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. సాధారణంగా మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏఐసీసీ కార్యదర్శితో చర్చిస్తే సరిపోతుందని సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఇక్కడ రివర్స్ జరిగిందని మంత్రివర్గ విస్తరణపై రాహుల్‌తో మహేశ్‌కుమార్ గౌడ్ చర్చించారని, రేవంత్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్‌తో భేటీకే పరిమితం అయ్యారని గుర్తు చేస్తున్నారు. తరుచూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు సాధించే రేవంత్‌రెడ్డి.. ఇన్ని నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు సాధించలేకపోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.