Congress | హైదరాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో విచిత్రంగా సొంత పార్టీ అభ్యర్థులే కలవరపడుతున్నారు. వివిధ రాష్ర్టాల్లో రాహుల్, ప్రియాంక ప్రచారం చేసిన స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోతుండటమే ఇందుకు కారణం. గతంలో ఎన్నికలు జరిగిన పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఈ ఇద్దరు ప్రచారం చేసిన 95% స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో వీరిద్దరు దాదాపు 200 నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా కాంగ్రెస్ గెలిచింది కేవలం రెండంటే రెండే స్థానాలు. పంజాబ్‌లోనూ అదే పరిస్థితి. ఢిల్లీలో మరీ ఘోరంగా ఒక్క స్థానం కూడా దక్కలేదు.
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక ప్రచారం ఆ పార్టీకి ఘోర పరాజయమే మిగిల్చింది. ఆ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఇద్దరు అగ్రనేతలు ప్రచారం చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోయింది. గత ఎన్నికల్లో కొడంగల్‌లో రాహుల్‌గాంధీ ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని మళ్లీ కొడంగల్‌కు ప్రచారం కోసం పిలిచే సాహసం రేవంత్‌రెడ్డి చేయడం లేదు. మిగిలిన నేతలు కూడా రాహుల్, ప్రియాంక ప్రచారానికి వస్తామంటేనే జంకుతున్నట్టు తెలిసింది. తమ నియోజకవర్గానికి అవసరం లేదని చెప్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి 25కుపైగా నియోజవర్గాల్లో ప్రచారం చేశారు. దీంతో అక్కడి అభ్యర్థుల్లో ఓటమి సెంటిమెంట్ భయం పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.