Raghava Constructions | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు ఏ కేసుకు సంబంధించిన సోదాలు నిర్వహించారన్న చర్చ కొనసాగుతున్నది. లగ్జరీ వాచీల కేసు, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీలు, రూ.650 కోట్ల టీడీఎస్ కేసు, కుమారుడు పొంగులేటి హర్షారెడ్డికి చెందిన రూ.1,300 కోట్ల పైచిలుకు ఆస్తులకు సంబంధించిన వివరాలపై ఈడీ ఆరా తీసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
అయితే, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోవడంపై కూడా ఈడీ ప్రత్యేకంగా సమాచారం సేకరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం రూ.4,350 కోట్ల ప్రతిపాదిత అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ఎత్తిపోతల్లో తొలి ప్యాకేజీ పనులు పొంగులేటి కంపెనీ దక్కించుకోవడంతో కంపెనీ ముఖవిలువ, టెండర్ ప్రక్రియ జరిగిన తీరు తదితర అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకున్నది. ఎన్‌కేఎల్‌ఐఎస్ ప్యాకేజీ పనులను దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా కంపెనీలు ముందే కూడబలుక్కుని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనే ఆరోపణలొచ్చాయి. రూ.1,134.62 కోట్లతో చేపట్టాల్సిన ప్యాకేజీ-1 పనులకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేసింది.
అదే పనులకు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ 4.85% అధికంగా కోట్ చేసింది. దీంతో ఎల్1గా నిలిచిన రాఘవ కంపెనీకి ప్యాకేజీ-1 టెండర్ దక్కింది. రూ.1,126.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ-2 పనులకు మేఘా ఇంజినీరింగ్ 3.95% అధికంగా కోట్ చేయగా, రాఘవ కంపెనీ 4.8% అధికంగా కోట్ చేసింది. దీంతో ఎల్-1గా నిలిచిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ప్యాకేజీ-2 టెండర్ దక్కింది.
మేఘా కంపెనీ అధికంగా కోట్ చేసిన చోట రాఘవ కంపనీ తక్కువగా కొటేషన్ దాఖలు చేయడం, మేఘా కంపెనీ తక్కువ కోట్ చేసిన చోట రాఘవ కంపెనీ అధికంగా కొటేషన్ దాఖలు చేయడం లోపాయికారి ఒప్పందంలో భాగమేనని ఆరోపణలు వచ్చాయి. ఇక, ఈ ప్రాజెక్టు పనుల కోసం ఎల్అండ్టీ, ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) సైతం బిడ్లను దాఖలు చేశాయి. చివరకు మేఘా, రాఘవ కంపెనీలే అర్హత సాధించాయి. దీంతో టెండర్‌కు ముందే ఈ ఇరు కంపెనీలు కూడబలుక్కున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఆయా కంపెనీలు దాఖలు చేసిన కొటేషన్లే నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు.