ఏదైనా నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్లు కట్టి కోట్లు గడించాలనుకోవడం, భూమి యజమానితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే దానిని వ్యాపారం అంటారు. కానీ యజమాని అగ్రిమెంట్ చేసేందుకు నిరాకరిస్తే ఆ నిర్మాణ సంస్థ అధికార, కండ బలాన్ని ప్రదర్శిస్తే దానిని ‘దౌర్జన్యం’ అంటారు. ‘బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ’ కూడా ఇదే వరుసలోదే. ‘ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలో రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏం పని ఉంటుంది?. అసలు వివాదాస్పద భూమి దగ్గరకు నా కుమారుడు వెళ్లనే లేదు’ అని ‘నమస్తే తెలంగాణ’ కథనంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఏమీ జరగనట్లు వ్యాఖ్యానించారు. కానీ…..
రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యాపారం కోసం స్వయంగా మంత్రే రంగంలోకి దిగినట్టు తేలింది. అధికారం చేతుల్లో ఉన్నదని ఒక ప్రైవేటు భూమిలో పొంగులేటి కుటుంబం సాగించిన దౌర్జన్యకాండకు వట్టినాగులపల్లి ఉదంతం పరాకాష్టగా నిలిచింది. తాజాగా ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం, రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్ ప్రమేయం కూడా ఇందులో బయటపడింది. శ్రీనివాస్ హద్దులు మార్చి మంత్రి కుటుంబానికి సహకరించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/మణికొండ: రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 245లో సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవిషా, ప్రియాంకషా, రాధికాషాకు ఇచ్చారు. ఈ భూమిని ఆనుకొని సర్వేనంబర్ 258, 259 భూములు ఉన్నాయి. ఈ భూములు అవినవ్షా, అక్షయ్షా పేరిట ఉండగా… వీరి భూముల్లో నుంచే అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం జరగడంతో కొంత భూమిని కోల్పోయారు. ప్రస్తుతం అవుటర్‌ను ఆనుకొని ఈ రెండు సర్వేనంబర్లలో 9.10 ఎకరాల భూమి ఉన్నది. దీనిని రాఘవ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ కింద తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు యజమానుల సమ్మతితో అగ్రిమెంట్లు పూర్తయ్యాయి.
ఈ భూమి వెనకనే సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాల భూమిని కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకుంటే భారీఎత్తున నిర్మాణాన్ని చేపట్టవచ్చని రాఘవ కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు సతీశ్షాను అడిగితే డెవలప్మెంట్కు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఎలాగైనా ఆ భూముల్ని కూడా సాధించాలని కొన్ని నెలలుగా మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా కొన్నిరోజుల కిందట మంత్రి పొంగులేటి స్వయంగా సతీశ్షాను తన దగ్గరికి పిలిపించుకున్నట్టు తెలిసింది. అవినవ్షా, అక్షయ్షా తమ భూముల్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఇచ్చినందున మీ భూముల్ని కూడా ఇవ్వాలని ఒత్తిడి చేశారు.
‘111 జీవో కింద ఉన్న భూములు.. అయినా నా బిడ్డలకు ఇచ్చిన భూముల్ని డెవలప్మెంట్కు ఇచ్చేందుకు వాళ్లు అంగీకరించడం లేదు’ అని సతీశ్‌షా మంత్రికి చెప్పినట్టు సమాచారం. ఎలాగైనా ఇవ్వాలని, 111 జీవో సంగతి తాము చూసుకుంటామని కూడా మంత్రి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సతీశ్‌షా ఒప్పుకోకపోవడంతో ఫోన్లో ఆయన కుమార్తె పల్లవిషాతో మంత్రి మాట్లాడినట్టు సమాచారం. ఆ సమయంలోనూ ఆమె తమ భూముల్ని ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తున్నది. ఆతర్వాత కొన్నిరోజులకు మంత్రి పొంగులేటి కుమారుడు స్వయంగా బంజారాహిల్స్‌లోని పల్లవిషా ఇంటికి వెళ్లి భూమిని డెవలప్మెంట్ కింద ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. ఆమె కూడా నిరాకరించడంతో మంత్రి కుమారుడు వెనుదిరిగినట్టు తెలిసింది. ఆతర్వాత కూడా పలువురితో సతీశ్షాపై ఒత్తిడి చేసినా డెవలప్మెంట్కు ఇచ్చేందుకు తమ కుమార్తెలు అంగీకరించడంలేదని చెప్పారట.
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ భూమి చేజిక్కకపోవడంతో రాఘవ కన్స్ట్రక్షన్స్ అధికార అస్ర్తాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వాస్తవానికి సర్వే నంబర్ 245, 258, 259ల్లో సమగ్ర సర్వే జరిగి ఎవరికి వారు హద్దులు నిర్ధారించుకొని తమ భూముల్ని స్వాధీనంలో ఉంచుకున్నారు. అందులో భాగంగా సతీశ్‌షా కూడా 245 సర్వే నంబరులోని 20.14 ఎకరాలకు ప్రహరీ నిర్మించుకొని అందులో గోశాల, ఇతరత్రా కార్యకలాపాలు చేసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ హద్దులు ఉండగా.. ఏనాడూ పక్క భూముల వారితో హద్దు గొడవలు లేవు. కానీ అవినవ్షా, అక్షయ్షా తమ భూముల్ని రాఘవ కన్స్ట్రక్షన్స్కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఇవ్వడం.. సతీశ్షాను కూడా అగ్రిమెంట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో వారి మధ్య వివాదాన్ని రాజేశారు.
ఇందుకోసం నిత్యం బడాబాబులకు అనుకూలంగా జిల్లాలో రాత్రికి రాత్రి భూముల హద్దులు మార్చడంలో ఆరితేరిన ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ (గురువారం శ్రీనివాస్‌కు చెందిన ఆస్తులపైనే ఏసీబీ దాడులు జరిగాయి)ను రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది. సర్వే నంబరు 258, 259ల్లో అవినవ్షా, అక్షయ్షాలకు చెందిన భూములు అవుటర్ రింగు రోడ్డు నిర్మాణానికి పోయాయి. కానీ దానిని కూడా కలుపుకొని వెనకన ఉన్న సతీశ్షాకు చెందిన 245 సర్వేనెంబర్లో ఆ విస్తీర్ణాన్ని చూపించే ప్రయత్నం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సర్వేలో సతీశ్‌షా ప్రహరీ లోపల అవివన్షా, అక్షయ్షాకు చెందిన భూములు ఉన్నట్టుగా ఏడీ శ్రీనివాస్ హద్దులు నిర్ధారించారు.
నిబంధనల మేరకు ఏడీ సర్వే జరిగే సమయంలో పక్క భూముల యజమానులందరికీ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ మాత్రం కనీసం సతీశ్షాకు కూడా నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా సర్వే చేసినట్టు తెలిసింది. ఇక్కడే కాదు… గత రెండేండ్లుగా ఈయన ఇదేరీతిన ఏకపక్ష సర్వేలు చేయడం పరిపాటని రెవెన్యూవర్గాలే చెప్తున్నాయి. కాగా ఏకపక్షంగా జరిగిన ఈ సర్వేపై సతీశ్‌షా కుమార్తెలు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రెవెన్యూ శాఖ, రంగారెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సర్వే ఏడీ, ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, గండిపేట తాసిల్దార్, మండల సర్వేయర్‌తో పాటు అవినవ్షా, అక్షయ్షాలను ప్రతివాదులుగా చేర్చారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు గత నెల 20వ తేదీన సర్వే ఉత్తర్వులను మధ్యంతరంగా సస్పెండ్ చేసింది.
ఈ భూములు అవుటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉండటంతో ఎక్కువ విస్తీర్ణంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవాలనేది రాఘవ కన్స్ట్రక్షన్స్ లక్ష్యం. కానీ సతీశ్‌షా కుమార్తెలు అంగీకరించకపోవడం, చివరకు అధికార బలం ప్రయోగించినా హైకోర్టు స్టే తెచ్చుకోవడాన్ని మంత్రి కుమారుడు జీర్ణించుకోనట్టు బాధితులు చెప్తున్నారు. చివరకు తమ భూమి విస్తీర్ణానికే ఎసరు పెట్టాలనుకున్నా తాము న్యాయ స్థానం ద్వారా రక్షణ తెచ్చుకున్నామని దీంతో వాళ్లంతా దౌర్జన్యానికి దిగారని అంటున్నారు.
ఈ క్రమంలోనే గత శనివారం రాత్రి మంత్రి కుమారుడు, ఇతరులు అక్కడికి వచ్చి దాదాపు 70 మంది వరకు బౌన్సర్లను పురమాయించడంతో వారంతా అక్కడ ఉన్న సెక్యూరిటీని చితకబాది జేసీబీలతో ప్రహరీ, గోశాలను కూల్చివేశారని చెబుతున్నారు. సతీశ్‌షా నేరుగా పోలీస్ ఉన్నతాధికారికి ఫోన్ చేసి తన భయాందోళన, జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టడంతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి బౌన్సర్లను తమ ైస్టెల్లో మందలించడం తదుపరి చోటుచేసుకున్న పరిణామాలను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.