కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 14 : శాతవాహన యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాత్రి 8.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జూనియర్ విద్యార్థులతో సీనియర్లు మీటింగ్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలికలు, బాలురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కొండగట్టు జేఎన్జీయూలో జరిగిన ర్యాగింగ్ ఘటన మరువకముందే శాతవాహనలో వెలుగుచూస్తుండటం విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నది.
‘రాత్రి 8.30 గంటలకు మీటింగ్ ఉంది. అందరూ తొందరగా మీమీ పనులు ముగించుకుని 233 నంబర్ గదికి రండి.. మీరు ఎంత తొందరగా వస్తే, అంతే తొందరగా, ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాలి. ఎవరూ మిస్ కాకుండా రండి’ ఇది శాతవాహన యూనివర్సిటీ జూనియర్ విద్యార్థుల గ్రూప్‌లో సీనియర్లు పెట్టిన మెసేజ్. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ సమావేశానికి వెళ్లిన విద్యార్థులను ఇంట్రడక్షన్ చెప్పాలంటూ, తడబడిన విద్యార్థులను డ్యాన్స్‌లు చేయిస్తూ, పాటలు పాడిస్తూ రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తున్నారని జూనియర్లు ఆందోళన చెందుతున్నారు. సీనియర్లు ఉన్న సమయంలో క్యాంటీన్‌కు రావద్దని, మెస్‌కు ఫార్మల్గా రావాలని, అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ఎవరికి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ర్యాగింగ్ గురించి కొందరు విద్యార్థులు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయగా, విషయం తెలుసుకున్న ఓ అధ్యాపకురాలు జూనియర్లను పిలిపించి మందలించినట్టు తెలిసింది. ‘మీరు నాకు తెలియకుండా రిజిస్ట్రార్‌కు చెప్తారా?, సీనియర్లు అన్నాక ర్యాగింగ్ చేయరా? స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. టేకిట్ ఈజీగా తీసుకోండి’ అంటూ గద్దించినట్టు సమాచారం.
యూనివర్సిటీలో గురువారం రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో సీఐలతో ప్రత్యేకంగా యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ర్యాగింగ్ ఫిర్యాదులు వస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వారి భవిష్యత్తు పాడవుతుందని మందలించి వదిలేశారు.