జడ్చర్ల టౌన్, మే 20 : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టింపులేదా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైష్ణవి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమోన్మాది చేతిలో వైష్ణవి హ త్యకు గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఆడబిడ్డలకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక షీ టీం, డెకాయి టీములు తిరిగేవని, రూ.700 కోట్లతో పోలీసు వ్యవస్థలో అనేక మా ర్పులను తీసుకొచ్చారని గుర్తుచేశారు.
నేరాలు అరికట్టేందుకు 10 లక్షల సీసీ కెమోరాలు పెట్టించి నిఘా పెట్టడంతో ప్రజలకు నిజమైన రక్షణ ఉండేదని గు ర్తుచేశారు. ఇవాళ రాష్ట్రంలో పట్టపగలు ఉన్మాదులు కత్తులు పట్టుకొని తిరుగుతుంటే పోలీసు వ్యవస్థ పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పారు. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు కేంద్ర మంత్రి కొడుకు అయినందుకే 9 రోజులపాటు పోలీసులు పట్టుకోకుండా తీవ్ర జాప్యం వహించారని విమర్శించారు. బాలిక, బండి భగీరథ్ బావామరదళ్లుగా తిరిగారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు.. నిందితుడి తండ్రిపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి సానుభూతి వ్యాఖ్యలు చూస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు చదువుతున్నట్టుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని హితవుపలికారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ రావాలని వేయికండ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపారు.