ఖైరతాబాద్, జూన్ 5: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించాలని సినీనటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టే బుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లో ప్రకృతి వనరులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీల అస్తి58త్వాన్ని ప్రభుత్వ చర్యలు ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆపరేషన్ ‘కగార్’తో ఉద్యమాలను అణిచివేశామని అనుకోవద్దని అన్నారు. కవి, రచయిత పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, ప్రజాకవి గద్దర్ సతీమణి విమల, సీనియర్ దళిత నాయకులు జేబీ రాజు, సీపీఐ నేత బాలమురళీ, సనాఉల్లాఖాన్ పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు వందలాది మందిని బూటకపు ఎన్కౌంటర్లలో హత్య చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరికాదని ఆయన అన్నారు.