హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: రిజర్వేషన్ల అంశంపై బీజేపీ తన విధానమేంటో వెల్లడించాలని, దీనిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై 13 బీసీ సంఘాలు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించాయి.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపారు. రాష్ట్ర పర్యటనకు త్వరలో రానున్న ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా రిజర్వేషన్ల అంశంపై తమ పార్టీ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పదేండ్ల పాలనలో బీసీల అభివృద్ధికి చిన్న పథకం కూడా పెట్టలేదని, కానీ అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించిందని, అది రిజర్వేషన్ల సిద్ధాంతానికి విరుద్ధమని వివరించారు. ఓబీసీల డిమాండ్లలో ఏ ఒక్కదానిని బీజేపీ సర్కారు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఉన్న రిజర్వేషన్లనే ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
బీసీలకు అన్యాయం చేస్తే దేశంలో తిరుగుబాటు తప్పదని, బీసీల హక్కులను పరిష్కరించకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రాజేందర్, రామకృష్ణ, జ్యోతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.