ముషీరాబాద్, డిసెంబర్ 22: రాష్టరంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులతో చర్యలు జరిపి ఖాళీల భర్తీకి పూనుకోవాలని కోరారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో ఆదివారం జరిగిన నిరుద్యోగుల సదస్సులో ఆయన మాట్లాడారు. టీజీపీఎస్సీ గ్రూప్స్ పోస్టుల సంఖ్యనును పెంచాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, ఇతర అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఆ మేరకు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు.
ఒకే దఫా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తించాలని డిమాండ్ చేశారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేశ్, నందగోపాల్, బీ శ్రీనివాస్, సతీశ్, ఉదయ్, పృధ్వీగౌడ్, నిఖిల్, వెంకటేశ్‌గౌడ్, బలరామ్, నాగేశ్వరరావు తదితరలు పాల్గొన్నారు.