రవీంద్రభారతి, జూన్ 25: ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సీఎం రేవంత్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదవులు చదివేందుకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో బీసీ సంక్షేమ సంఘం నేతలు నీలం వెంకటేశ్ ముదిరాజ్, విద్యార్థి సంఘం నేత పగిళ్ల సతీశ్ అధ్యక్షతన నిర్వహించిన ‘ఫీజు పోరు’ సభకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు బకాయిలు చెల్లిస్తామని చెప్పిన సీఎం రేవంత్.. గద్దెనెక్కిన తర్వాత 10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీజు లు చెల్లించలేక ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి ఉసురు రేవంత్‌కు తగులుతుందని తెలిపారు.
విద్యార్థులపై పెట్టిన ఆర్ఆర్ యాక్ట్ జీవో 8,9 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ 30న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, అన్ని కలెక్టరేట్లను ముట్టడించాలని విద్యార్థిలోకానికి ఆయన పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.