హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత రాహుల్‌గాంధీకి రాసిన బహిరంగలేఖను ఆయన ఆదివారం మీడియాకు విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు కులగణన ప్రక్రియ ప్రారంభం కాలేదని లేదని నిప్పు లు చెరిగారు. జాతీయ స్థాయిలో కులగణన చేయాలని రాహుల్‌గాంధీ డి మాండ్ చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన చేపట్టాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం సీలింగ్ ఉన్నదని చెప్పి తప్పించుకునేందుకు యత్నించొద్దని చురకలంటించారు. అసెంబ్లీలో చట్టం చేసి 42శాతం రిజర్వేషన్లను పెట్టొచ్చని, అన్ని పార్టీలు సహకరిస్తాయని తెలిపారు.