కాచిగూడ, నవంబర్ 17: రాజ్యంగ రచన సమయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు గడిచినప్పటికీ బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయమే జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో కాచిగూడలోని అభినందన్ హోటల్లో బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ వీ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల ఉద్యమాన్ని పటిష్టపర్చేందుకు ఈ నెల 25న రవీంద్రభారతిలో ‘బీసీల సమరభేరి’ నిర్వహించనున్నట్టు తెలిపారు. వీ హన్మంతరావు మాట్లాడుతూ.. కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నీలం వెంకటేశ్, నందగోపాల్, సుధాకర్, రామకృష్ణ, రమేశ్, ఉదయ్, జయంతి, వీరన్న, రాందేవ్, రఘుపతి, పరశురాం, రవి పాల్గొన్నారు.
జనగణనలో కులగణన చేపట్టాలి
హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణనలోనే కులగణన కూడా చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా 25న హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘బీసీల సమరభేరి’ నిర్వహించనున్నామని తెలిపారు. సంఘం కోర్ కమిటీ ఆధ్వర్యంలో సమరభేరి వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఒకే రోజులో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ సర్కారు బీసీలు ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు.