ముషీరాబాద్, అక్టోబర్ 30: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర బీసీ కమిషన్‌కే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందు ప్రత్యేక బాధ్యతలను అప్పగించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తాము హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని వేశామని, తమ వాదనలు విన్న కోర్టు పలు సూచనలు చేసిందని చెప్పారు.
డెడికేటెడ్ కమిషన్నే ఏర్పాటు చేయాలి: దాసు సురేశ్
బీసీ రిజర్వేషన్ల అంశంపై డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. మేధావులు, న్యాయకోవిదుల అభిప్రాయాలు స్వీకరించకుండానే ప్రభుత్వం ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.