నియామక ప్రక్రియను రాజ్యాంగబద్ధం చేయాలి: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఫిబ్రవరి 25: ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన తరువాత ప్రభుత్వాలు జాప్యం చేయకుండా నిర్ణీత గడువులోగా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్ ముషీరాబాద్‌లో జరిగిన నిరుద్యోగ జేఏసీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాప్రతినిధులు మరణిస్తే ఆరు నెలల్లోపు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా, ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన తరువాత 10 నుంచి 20 ఏండ్లవరకు ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీని ఉపాధి కోణంలో చూడకుండా సామాజిక కోణంలో చూడాలని, ఉద్యోగ నియామకాలను రాజ్యాంగబద్ధం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, అనంతయ్య, పగిళ్ల సతీశ్, మల్లేశ్ యాదవ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.