చిక్కడపల్లి, నవంబర్ 9: 14 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు, మంత్రులను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రంలో వివిధ కాలేజీ కోర్సుల్లో చదువుతున్న బీసీ విద్యార్థుల మూడేండ్ల ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ప్రభుత్వం కాంట్రాక్టులకు బిల్లులు పాస్ చేస్తుంది.. కానీ, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు చెల్లించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ(10 నెలల) పాలనలో ఖర్చుపెట్టిన లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బీసీ, ఎస్టీ విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్కాలర్షిప్లు రూ.20 వేలకు పెంచాలని, ఫీజుల బకాయిలు రూ.4వేల కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.