హైదరాబాద్, అక్టోబర్20 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన మొండివైఖరిని వీడాలని మాజీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. పరీక్షలు వాయిదా వేయబోమని సీఎం ప్రకటించడం దుర్మార్గమని, జీవో 29 ద్వారా మొత్తంగా రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదని నిప్పులు చెరిగారు. ఆ జీవో వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. నిరుద్యోగులపై లాఠీచార్జి దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెరిట్లో వచ్చిన వారిని రిజర్వేషన్ల కింద లెకించవద్దని, ఆ విధానం అన్నిస్థాయిల్లో పాటించాలని కోర్టు తీర్పులు చెప్పాయని, కానీ గ్రూప్-1లో ఆ విధానం పాటించడం లేదని ధ్వజమెత్తారు. జీవో నం 55 రాజ్యాంగబద్ధమైనదని, దానిని అమలు చేయాలని, జీవో 29 రిజర్వేషన్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు. రే సమావేశంలో నిరుద్యోగ జేఏసీ నేతలు వేముల రామకృష్ణ, రాజేందర్, అనంతయ్య, నందాగోపాల్, ఉదయ్‌నేత, మోదీ రాందేవ్, రుషికుమార్, ఉమామహేశ్వరరావు, సహదేవ్ పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 20: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో జీవో 55 అమలు చేయాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 7% జనాభా లేని అగ్రవర్ణాలకు 50% రిజర్వేషన్లను కల్పిస్తున్న జీవో 29ను రద్దు చేసి, మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన పరీక్షలు రద్దు చేసి కేవలం గ్రూప్-1 నోటిఫికేషన్లోనే 63 పోస్టులు కలిపి రీషెడ్యూల్ చేసిందని దుయ్యబట్టారు. జీవో 29 తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు.