Telangana | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే కులగణన నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభపక్ష నేతగా రాహుల్‌గాంధీ నిత్యం డిమాండ్ చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ఆ లేఖలో వివరించారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ఊసే తీయడం లేదని, మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే అణచివేస్తుందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతం సీలింగ్ అని చెప్పి తప్పించుకునేందుకు వీలులేదని తేల్చిచెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో 20వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించాలని పిలుపునిచ్చారు. అప్పటికీ స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.