హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసినా పట్టించుకోరా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చలు జరపాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రూ.4వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని 1,800 కాలేజీలను రెండురోజులుగా తాళాలు వేసి బంద్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. ఫీజు బకాయిల కోసం కాలేజీలకు తాళాలు వేయడం 76ఏండ్లలో ఎప్పుడూ జరగలేదని మండిపడ్డారు. పదినెలల పాలనలో ఏయే బిల్లులు చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గురుకుల పాఠశాలలకు డైట్ చార్జీలు ఇవ్వలేని ప్రభుత్వం, భవనాలు ఎలా కడుతుందని ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గురుకులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల యజమానుల ఆవేదనను అర్థం చేసుకోవాలని, వారిని బెదిరించడం సరికాదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యాలయాలకు కొత్తగా నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు.