హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభను గాంధీభవన్, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లా నడిపి రాష్ట్రం పరువుతీశారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు సమాచారమిచ్చి నిస్సిగ్గుగా సభా హక్కులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ కూడా అధికారపక్షానికి వంతపాడుతున్నారని మండిపడ్డారు. 5 రోజులు 45 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు చెప్పుకోవడం మినహా సర్కారు సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు. 13 బిల్లులను చర్చలేకుండా హడావుడిగా ఆమోదించడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీఏసీ మినిట్స్‌ను బహిర్గతం చేయకుండా ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. 15 రోజులు సభ నడపాలని, పీపీటీకి అవకాశం ఇవ్వాలని అడిగిన బీఆర్ఎస్ గొంతునొక్కారని విమర్శించారు. గతంలో ఎన్నడూలేనివిధంగా సీఎంను విమర్శించిన సభ్యుల మైక్ కట్ చేసి స్పీకర్ సరికొత్త సంప్రదాయానికి తెరలేపారని ఎద్దేవాచేశారు. పరస్పర సమన్వయంలేని సీఎం, మంత్రులు కేసీఆర్‌ను దూషించడంలో మాత్రం ఏకమవుతున్నారని విమర్శించారు.
మాటలు..చేతలకు పొంతనలేదు..
పవిత్రమైన అసెంబ్లీలో సీఎం, మంత్రులు పచ్చి అబద్ధాలు చెప్పారని వివేకానంద్ ధ్వజమెత్తారు. సర్కారు చెప్పే మాటలు, చేసే పనులకు పొంతనలేదని విమర్శించారు. మండలి చైర్మన్, స్పీకర్ డిప్యూటీ సీఎం, మంత్రులు చెప్పిన మాటలు తప్పని, ఇక్కడ చెప్పేదానికి క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని కుండబద్దలు కొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ల రిపేర్, కరెంట్ సరఫరా విషయంలో ప్రభుత్వ డొల్లతనాన్ని మండలి చైర్మన్ బట్టబయలుచేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సక్రమంగా బిల్లులు రావడంలేదని, దీనిపై వెంటనే సమీక్షించాలని స్పీకర్ మంత్రి పొంగులేటిని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.
సమైక్యవాదులకు సీఎం రేవంత్ మద్దతు
తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి సమైక్యవాదులకు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేత విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పి సభాహక్కులను ఉల్లంఘించారని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించకుండా సర్కారు పారిపోయిందని విమర్శించారు. శాససభావ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సభ ను నడపడంలో అట్టర్‌ఫ్లాప్ అయ్యారని ధ్వజమెత్తారు. కేవలం అధికారపక్ష సభ్యులు మాట్లాడిన సందర్భంలోనే టీవీల్లో చూపించారని, ఇతర పక్షాల సభ్యులు మాట్లాడుతున్నప్పుడు చూపించలేదని ఆరోపించారు. ఈ అంశంలో సర్కారు వైఖరిని బీజేపీ, ఎంఐఎం సభ్యులు తప్పుబట్టిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తర్వాత ప్రహసనంగా మార్చారని మండిపడ్డారు. సభలో నిద్రపోయిన సభ్యుల వైఖరిని చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు. ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని అన్నివర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు.