KP Vivekananda | కల్లు గీత వృత్తిని నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గీత కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేపీ వివేకానంద మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణ, నివారణపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గ్రామగ్రామాన గల్లీగల్లీలో బెల్ట్ షాపుల బెడద ఎక్కువైందని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కానీ బెల్ట్ షాపుల పేరిట గీత కార్మికుల ఇండ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గీత కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కల్లు గీత వృత్తిని నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని విమర్శించారు.
కిల్లీ బడ్డీల్లో కూడా డ్రగ్స్, గంజాయి దొరుకుతోందని కేపీ వివేకానంద తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ, నివారణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బెల్ట్ షాపుల నియంత్రణకు, గీత కార్మికుల వృత్తిని కాపాడుకునేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు వెంటాడుతూనే ఉంటామని తెలిపారు.