అబద్ధపు మాటలతో, అసత్య ప్రచారపు పునాదులపై కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గండిమైసమ్మ చౌరస్తాలోని బౌరంపేట సహకార సంఘం బ్యాంకు ముందు రైతు రుణమాఫీపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బౌరంపేట, దుండిగల్‌కు చెందిన రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేపీ వివేకానంద వివేకానంద మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేటా ముంచిందని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. బౌరంపేట, దుండిగల్ బ్యాంకులో 632 మంది రైతులు రుణం పొందితే.. కేవలం 14 మంది రైతులకు 4.30 లక్షలు మాత్రమే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. మిగతా 618 మంది రైతులకు 2.95 కోట్ల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మోసపూరిత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పత్తాకు లేదని వివేకానంద విమర్శించారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేవలం 5 శాతం మందదికే రుణమాఫీ చేసిందని విమర్శించారు.