Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఎరువుల సరఫరాలో ఏడాదిలోనే ఎంత తేడా?! ఏడాది క్రితం వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎరువులు దొరికేవి. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకొనేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లు మొదలయ్యాయి. రైతులకు గంటల తరబడి నిలబడే ఓపిక లేక క్యూలైన్లలో చెప్పులు, పాస్‌బుక్కులు దర్శనమిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎరువుల కోసం నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. రైతుల వీపుల మీద లాఠీలు విరిగేవి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఎరువుల గోస తీర్చడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో రోజుల తరబడి సమీక్షలు నిర్వహించారు. తద్వారా ఎరువుల గోస తీర్చేందుకు ‘ముందస్తు’ వ్యూహాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీజన్ ప్రారంభమయ్యాక, రైతులు పంటలు వేయడం మొదలుపెట్టిన తర్వాత కేంద్రం నుంచి ఎరువులు తీసుకొచ్చేవారు. కేసీఆర్ అందుకు భిన్నంగా సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి ఎరువులు తీసుకొనిరావాలని అధికారులను ఆదేశించారు.
సకాలంలో ఎరువులు రప్పించేందుకు పలువురు అధికారులను ప్రత్యేకంగా ఢిల్లీకి పంపించేవారు. వారంతా రెండు మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసి అక్కడి అధికారులతో మాట్లాడి రాష్ర్టానికి అవసరమైన ఎరువులు తీసుకొచ్చేవారు. దీంతో యాసంగి సీజన్‌కు అక్టోబర్, నవంబర్లోనే కావాల్సిన ఎరువులను తీసుకొచ్చి, వెంటనే మండలస్థాయికి పంపించి అక్కడ నిల్వ చేసేవారు. దీంతో రైతులకు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెంటనే సరఫరా చేసి కొరత లేకుండా చూసేవారు. దీంతోపాటు ఎన్ని ఎకరాలు సాగవుతాయో కచ్చితంగా అంచనా వేసి అందుకు కాస్త అదనంగానే తీసుకొచ్చేవారు. దీంతో కొరత అనే మాటే వినపడలేదు.
బీఆర్ఎస్ హయాంలో రైతుల అవసరాల మేరకు ఎరువులు సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకున్నది. గడిచిన పదేండ్లలో ఎరువుల వినియోగం రెట్టింపైనా.. ఎక్కడా కొరత అనే మాట వినిపించలేదు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో అంటే 2014-15లో రాష్ట్రంలో మొత్తం 25.14 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించగా, 2022-23లో అది 40 లక్షల టన్నులకు చేరింది. ఎనిమిదేండ్లలో 15 లక్షల టన్నుల వినియోగం పెరిగింది. అయినప్పటికీ, ఎక్కడా కొరత రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. పెరుగుతున్న సాగు, వినియోగానికి అనుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం, అప్పటికే మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో 2019-20 నుంచి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. అప్పటినుంచి ఏడాదికి 30 లక్షల టన్నులకు తగ్గకుండా రైతులు ఎరువులను వినియోగించినట్టు రికార్డులు స్పష్టంచేస్తున్నాయి.
రాష్ట్రంలో మొన్నటివరకు డీఏపీ కొరత వేధించగా, ఇప్పుడు యూరియా కొరత తాండవం చేస్తున్నది. ఈ సీజన్లో మొత్తం 9.8 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 8.8 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేసినట్టు సర్కారు ప్రకటించింది. ఈ మాత్రం దానికే నానా తంటాలు పడుతున్నది. కేసీఆర్ హయాంలో యాసంగి సీజన్లో 10 లక్షల టన్నులకుపైగా యూరియా సరఫరా చేసిన సందర్భాలున్నాయి. ప్రతి సీజన్లో 8 లక్షల టన్నులకు తగ్గకుండా పంపిణీ చేసింది. ఇంత భారీ మొత్తంలో సరఫరా చేసినా ఎన్నడూ కొరత అనే మాట రాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నది.
రైతులకు యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఈ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి యూరియాను తీసుకొనిరావడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఈ యాసంగి సీజన్లో 79.4 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందుకోసం మొత్తం 19.6 లక్షల టన్నుల ఎరువులు, ఇందులో యూరియా 9.8 లక్షల టన్నులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు రైతులు కొనుగోలు చేసిన యూరియా 8.8 లక్షల టన్నులే. అంటే అంచనాల కన్నా తక్కువగానే కొనుగోలు చేశారు. అయితే ముందుగా అంచనా వేసిన ప్రకారం కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో అధికారులు విఫలం కావడమే ప్రస్తుత కొరతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తన పని సరిగ్గా చేయకుండా కేంద్రం ఇవ్వడం లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు అధికారులు చెప్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.