Asaduddin Owaisi | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలంటూ కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు చట్టబద్ధత లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్ విజయలక్ష్మిని కలిసి హైడ్రాకు చట్టబద్ధత లేదని వివరించారని తెలిపారు. ఎమ్మెల్యే కౌసర మొయినుద్దీన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నించినట్టు చెప్పారు.
తన చిన్నతనంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయం ఉన్న ప్రదేశంలో వాటర్‌ఫాల్ ఉండేదని, నెక్లెస్‌రోడ్డు హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేదని చెప్పారు. హైడ్రా అధికారులు వాటిని కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు. గోల్కండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్స్ ఉన్నదని, అక్కడ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడతారని చెప్పారు. కావాలంటే ఆ ఫొటోలు ఇస్తానని తెలిపారు. నిజాంల కాలంలోనే ఎఫ్టీఎల్కు సంబంధించిన హద్దురాళ్లను ఏర్పాటు చేశారని, అధికారులు వాటిని ఇప్పటికీ చూసుకోవచ్చని పేర్కొన్నారు. మేయర్‌తోపాటు చీఫ్ సెక్రటరీకి ఇదే విషయాన్ని వివరించినట్టు పేర్కొన్నారు.