Assembly Session | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడే సమయానికి తాము వ్యవసాయానికి ఇచ్చిన సగటు విద్యుత్తు కేవలం 6 గంటలే అని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నది. గురువారం శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది.
ఇందులో తాము రాష్ట్రం ఏర్పడేనాటికి 6 గంటల విద్యుత్తే సరఫరా చేశామని తెలిపింది. అంటే.. తమ పాలనలో విద్యుత్తు పరిస్థితి దారుణంగా ఉండేదని స్వయంగా ఒప్పుకున్నట్టయ్యింది. 6 గంటలు ఒకేసారి ఇచ్చారా? విడతలుగా ఇచ్చారా? ఎన్ని విడతలుగా ఇచ్చారు? అన్న విషయాన్ని మాత్రం దాచిపెట్టింది. ఆ సమాచారం కూడా శ్వేతపత్రంలో పొందుపర్చి ఉంటే, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు విషయంలో ఎంత ఘోరంగా వ్యవహరించిందో స్పష్టంగా అర్థమయ్యేది.
బీఆర్ఎస్ పాలనలో సగటున 19.22 గంటలు
తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి సగటున రోజుకు సరఫరా అయిన విద్యుత్తు ఏకంగా 19.22 గంటలపాటు ఉన్నదని శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్నది. అయితే ఇది కూడా ఒకింత తప్పే. ఎందుకంటే.. రాష్ట్రం మొత్తంపై సగటున రోజుకు ఎంత సమయం విద్యుత్తు సరఫరా అవుతోందనేది గణించి చెప్పింది. కానీ ఇందులో సాంకేతిక అంతరాయాలు, నిర్వహణ అంతరాయాలు, ఆకస్మిక అంతరాయాల గురించి చర్చించలేదు.
తుఫానులు, భారీ వర్షాలు, పిడుగుపాట్లకు కలిగే అంతరాయాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చెప్పినా 2014కు ముందు ఆ పార్టీ ఇచ్చిన 6 గంటలతో పోల్చుకుంటే 3.2 రెట్లు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పినైట్టెంది. ఒక సబ్‌స్టేషన్ పరిధిలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఉన్నప్పటికీ, పక్క సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు, చెట్లు కొట్టడం, సాంకేతిక అంతరాయాలు ఇలా అన్నీ కలిపి 20 గంటల పాటే విద్యుత్తు ఇచ్చారనుకుంటే రెండు సబ్ స్టేషన్ల పరిధిలో సగటు సరఫరా 22 గంటలు అవుతుంది.
ఇలాంటి సాంకేతిక అంశాల జోలికి పోకుండా 19.22 గంటల విద్యుత్తును సగటున అందించారని వెల్లడించింది. అయితే, గతంలో కాంగ్రెస్ పాలనలో ఈ స్థాయి కరెంటు ఇవ్వటం సాధ్యం కాలేదని తన వైఫల్యాన్ని గణాంకాలతో సహా స్పష్టం చేసింది. తెలంగాణ వచ్చాక విద్యుత్తు రంగంలో గణనీయ ప్రగతి సాధించినట్టు, ట్రాన్స్మిషన్, డిస్కం వ్యవస్థలను రూ.వేల కోట్లతో బలోపేతం చేసిన గణాంకాలను కూడా శ్వేతపత్రంలో పొందుపర్చారు. ఇలా మొత్తంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పులను ఎలాంటి మొహమాటం లేకుండా ఒప్పుకున్నట్టయింది.
అధికారపక్షం అభాసుపాలు
విద్యుత్తుపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన, నిర్దిష్టమైన సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి విద్యుత్తుపై తలాతోక లేకుండా మాట్లాడి మరోసారి అభాసుపాలయ్యారు. కేవలం విద్యుత్తు రంగంలో అప్పులు ఉన్నాయని చెప్పడం తప్పితే.. దాని వల్ల కలిగిన వ్యవస్థాపరమైన లాభాలు, ప్రజలకు కలిగిన వసతులు, ఆయా రంగాలకు ఇచ్చిన రాయితీలను ప్రతిపక్షాలు ఎత్తిచూపినా అధికారపక్షం మౌనం వహించింది.
అప్పుల విషయంలో మాజీ విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి.. ‘అవును అప్పులు తెచ్చాం. అందుకే ఇప్పటికే సగం వరకు తీర్చేశాం’ అని అధికారపక్ష రాజకీయ విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రం వచ్చేనాటికి ఉన్న అప్పులు, తర్వాత తెచ్చిన అప్పులతో ఏమేం చేశారో స్పష్టంగా చెప్తూ.. కాంగ్రెస్ సర్కారు అప్పులు లేకుండా అన్ని వర్గాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఇస్తే అంతకంటే సంతోషం ఏమిటని జగదీశ్‌రెడ్డి వేసిన సెటైర్‌కు అధికారపక్షం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.
అధికార పక్షంలో నిస్తేజం
బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ అధికారపక్షంలో నిస్తేజం ఆవహించేలా విమర్శనాస్ర్తాలు సంధించారు. బుధవారం ఆర్థిక పరిస్థితిపై, గురువారం విద్యుత్తుపై విడుదల చేసిన శ్వేతపత్రాల్లో అంకెల్లో తప్పులుండటాన్ని అక్బరుదీన్ ఎత్తిచూపటంతో విద్యుత్తు మంత్రి భట్టికి ఏం మాట్లాడాలో తెలియక రాజకీయ విమర్శలకు దిగారు. సిద్దిపేట, గజ్వేల్ ప్రజలను అవమానిస్తున్నారని, వారు పూర్తిగా బిల్లులు కట్టడం లేదని చెప్పడం సరైంది కాదని హరీశ్‌రావు అధికార పార్టీకి ఘాటుగా సమాధానమిచ్చారు.
పెండింగ్ బిల్లులు పరిశ్రమలు, లేదా నీటిపారుదలశాఖకు సంబంధించినవి అయ్యి ఉండొచ్చని, అంతేగానీ ప్రజలు ఎప్పుడూ బిల్లులు చెల్లిస్తూనే ఉంటారని చెప్పటంతో అధికారపక్షం సైలైంట్ అయింది. కేటీఆర్ మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంటే ఇచ్చామని చెప్పటం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా విజయవంతం కాని గ్యాస్ విద్యుత్తు కేంద్రాలను తామూ ప్రారంభించలేదని సహేతుకమైన సమాధానం చెప్పటంతో అధికారపక్షం గొంతు మూగబోయింది. తమ మిత్రపక్షమైనప్పటికీ సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పక్షం గాలి తీసేశారు. ఉచిత విద్యుత్తును పూర్తిస్థాయిలో అమలు చేసింది కేసీఆర్ అని స్పష్టంగా చెప్పటంతో అధికార పార్టీ నేతలకు కక్కలేక మింగలేని పరిస్థితి ఎదురైంది. భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఏర్పాటయ్యాయని కుండబద్దలు కొట్టారు.
న్యాయ విచారణకు రెడీ
విద్యుత్తు నష్టాలు, కొనుగోళ్లపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రతిపక్షాలను బెదిరించాలనే వ్యూహంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ ప్రస్తావన తీసుకొస్తే.. బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ఇచ్చిన సమాధానంతో అధికారపక్షం డిఫెన్స్‌లో పడింది. ‘అప్పులు తెచ్చి, అభివృద్ధి సాధించాం. అందులో సగం అప్పులు కూడా తీర్చాం. తెలంగాణలో ఇంతటి అభివృద్ధికి, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే కారణం 24 గంటల విద్యుత్తే. విద్యుత్తు అప్పులు, కొనుగోళ్లపై తప్పకుండా న్యాయ విచారణ జరిపించాలని మేం కోరుతున్నాం’ అని సభకు విన్నవించారు. దీంతో విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేద్దామనుకొని ఏం మాట్లాడలేక అధికార పక్షం మౌనముద్ర దాల్చింది.
ప్రశ్నలకు సమాధానం కరువు
విపక్షాల ప్రశ్నలకు తెల్లముఖం వేసుకుని కూర్చున్నారేగానీ, అధికారపక్షం నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. ముఖ్యంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నకు తెల్లముఖం వేయడమే జవాబైంది. గృహాలతో సహా అన్ని వర్గాలకు 24 గంటల విద్యుత్తును ఇస్తారా? లేదా? మీ వైఖరి ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు అధికార పక్షం వద్ద సమాధానం లేకపోయింది. వ్యవసాయ రంగంలో మోటార్లకు మీటర్లు పెడతారా? మీ వైఖరి ఏమిటి? అని అడగ్గా మళ్లీ మౌనమే ఎదురైంది. కేంద్ర విద్యుత్తు సవరణల చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఏమిటన్న ప్రశ్నకూ సైలెన్సే. అలాగే విద్యుత్తు చార్జీలు పెంచుతారా? అని సూటిగా అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం దాటవేశారు.